
ఆర్మీ దుస్తుల అమ్మకంపై నిషేధం!
చండీగఢ్: పఠాన్ కోట్ ఉగ్రదాడితో అప్రమత్తమైన పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్మీ దుస్తుల అమ్మకాలపై నిషేధం విధిస్తూ ఆదివారం నిర్ణయం తీసుకుంది. దీనిద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వస్త్ర వ్యాపారులు ఆర్మీ యూనిఫామ్ను అమ్మడానికి వీలు లేదు.
పఠాన్ కోట్ సైనిక స్థావరంపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో రావడం వలనే వారు భద్రతా సిబ్బంది కంటికి చిక్కకుండా లోనికి ప్రవేశించారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంకా పలు ఘటనల్లో సైతం ఉగ్రవాదులు మార్కెట్లో సులభంగా దొరికే ఆర్మీ దుస్తులను ధరించి యథేచ్ఛగా వారు అనుకున్న ప్రదేశానికి చేరుతుండటంతో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకుంది.