‘మెసెంజర్ ఆఫ్ గాడ్’పై చిచ్చు | Punjab govt stops screening of 'Messenger of God' | Sakshi
Sakshi News home page

‘మెసెంజర్ ఆఫ్ గాడ్’పై చిచ్చు

Published Sun, Jan 18 2015 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

‘మెసెంజర్ ఆఫ్ గాడ్’పై చిచ్చు

‘మెసెంజర్ ఆఫ్ గాడ్’పై చిచ్చు

* ఈ చిత్రానికి కేంద్రం అనుమతిపై
*  సెన్సార్ బోర్డులో రాజీనామాల పర్వం
* ఒకే రోజు 9 మంది బోర్డు సభ్యుల రాజీనామా
* రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డ కేంద్ర మంత్రి జైట్లీ
*  సినిమా ప్రదర్శనపై పంజాబ్ ప్రభుత్వం నిషేధం

 
న్యూఢిల్లీ: డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌సింగ్ నటించిన వివాదాస్పద చిత్రం ‘మెసెంజర్ ఆఫ్ గాడ్’ విడుదల వ్యవహారంపై తలెత్తిన వివాదం రాజకీయరంగు పులుముకుంది. వివాదాస్పద అంశాలున్నాయన్న కారణంతో ఈ చిత్రం విడుదలకు తాము అనుమతి నిరాకరించినా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఫిలిం సర్టిఫికేషన్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎఫ్‌సీఏటీ) అనుమతించడంపై సెన్సార్ బోర్డు సభ్యులు రాజీనామాలపర్వానికి తెర లేపారు. కేంద్రం జోక్యంతో కలత చెంది బోర్డు చైర్‌పర్సన్ లీలా శాంసన్ గురువారం తన పదవికి రాజీనామా చేయగా ఆమెకు మద్దతుగా 9 మంది సభ్యులు శనివారం మూకుమ్మడి రాజీనామాలు చేశారు.
 
 సెన్సార్ బోర్డుపట్ల కేంద్ర వైఖరి నచ్చక బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు అరుంధతి నాగ్, ఐరా భాస్కర్, లోరా ప్రభు, పంకజ్ శర్మ, రాజీవ్ మసంద్, శేఖర్‌బాబు కంచెర్ల, షాజీ కరుణ్, శుభ్రా గుప్తా, టి.జి. త్యాగరాజన్‌లు కేంద్ర సమాచార, ప్రసారశాఖకు పంపిన ఉమ్మడి రాజీనామా లేఖలో పేర్కొన్నారు. దీంతో చైర్‌పర్సన్ సహా మొత్తం 24 మందిగల సెన్సార్ బోర్డు సభ్యుల సంఖ్య 14కు పడిపోయింది. మరికొందరు సభ్యులు కూడా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మరోవైపు బోర్డు సభ్యుల తీరును కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ శనివారం తీవ్రంగా తప్పుబట్టారు. యూపీఏ హయాంలో నియమితులైన సభ్యులంతా మెసెంజర్ ఆఫ్ గాడ్ చిత్రానికి ఎఫ్‌సీఏటీ ఇచ్చిన అనుమతి వ్యవహారంతోపాటు రాజీనామాలపె రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ‘రెబెల్స్ వితౌట్ ఎ కాజ్’ పేరిట ఆర్టికల్ పోస్ట్ చేశారు. సెన్సార్ బోర్డు నిర్ణయం నచ్చకుంటే ఎఫ్‌సీఏటీని ఆశ్రమించే హక్కు చట్టప్రకారం బాధిత నిర్మాతకు ఉంటుందని ఆయన గుర్తు చేశారు.
 
 సెన్సార్ బోర్డు నిర్ణయంతో ట్రిబ్యునల్ విభేదిస్తే అది బోర్డు స్వయంప్రతిపత్తిపై దాడి ఎలా అవుతుందని జైట్లీ ప్రశ్నించారు. ఇప్పటివరకూ తనతోపాటు సహాయ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ సెన్సార్ బోర్డు వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. బోర్డులో అవినీతిపై లీలా శాంసన్ చేసిన ఆరోపణలపై జైట్లీ స్పందిస్తూ దీనిపై శాంసన్ ఒక్కసారి కూడా తనకు ఫిర్యాదు చేయలేదని...అయినా సెన్సార్ బోర్డులో అవినీతి ఉంటే అందుకు బోర్డు సభ్యులు తమను తామే నిందించుకోవాలన్నారు. కేంద్రం నిధులు మంజూరు చేయకపోవడం వల్లే గత 9 నెలల్లో బోర్డు ఒక్కసారి కూడా సమావేశం కాలేకపోయిందన్న శాంసన్ ఆరోపణలను కూడా జైట్లీ తోసిపుచ్చారు. తమ శాఖ నిధులు విడుదల చేసినా సెన్సార్ బోర్డు ఆ నిధులను ఖర్చు చేయకుండా వెనక్కి పంపిందని జైట్లీ పేర్కొన్నారు. బోర్డు సమావేశాలను నిర్వహించకుండా పనిచేయనందుకు శాంసన్ తనను తాను నిందించుకోవాలని విమర్శించారు. ప్రముఖ నటుడు అనుపమ్‌ఖేర్ నేతృత్వంలోని గత సెన్సార్ బోర్డును 2004లో ఏర్పడిన యూపీఏ ప్రభుత్వం రాజకీయ కారణాలతో రద్దు చేసినా తమ ప్రభుత్వం మాత్రం అటువంటి పని చేయలేదని జైట్లీ తెలిపారు.
 
 ప్రదర్శనకు పంజాబ్ సర్కార్ నో...
 రాష్ట్రంలో శాంతిభద్రతలు, ప్రజల మత విశ్వాసాలు దెబ్బతినరాదనే కారణాల దృష్ట్యా ఆదివారం విడుదల కావాల్సిన ‘మెసెంజర్ ఆఫ్ గాడ్’ ప్రదర్శనను ఆపేయాలని పంజాబ్ ప్రభుత్వం  నిర్ణయించింది. సినిమా హాళ్లు సహా బహిరంగ, ప్రైవేటు ప్రదర్శనలకూ నిషేధం వర్తిస్తుందని ప్రకటించింది. చిత్రం ప్రదర్శనకు అనుమతిస్తే శాంతిభద్రతలకు భంగం వాటిల్లవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఈ చర్య చేపట్టినట్లు పంజాబ్ ముఖ్యమంత్రి సలహాదారు హర్‌చరణ్ బైన్స్ తెలిపారు. ఈ చిత్రం తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ పలు సిక్కుల సంఘాలతోపాటు శిరోమణి అకాలీదళ్, ఐఎన్‌ఎల్‌డీ వంటి రాజకీయ పార్టీలు శనివారం పంజాబ్, హరియాణా, ఢిల్లీలలో నిరసనలకు దిగడం తెలిసిందే.
 
 ‘యూపీఏ వర్సెస్ ఎన్డీఏగా..’
 సెన్సార్ బోర్డుతో నెలకొన్న సమస్యలను మోదీ సర్కారు... ఎన్డీఏ, యూపీఏ మధ్య రాజకీయ అంశంగా మారుస్తోందని కాంగ్రెస్ నేత, కేంద్ర సమాచార, ప్రసారశాఖ మాజీ మంత్రి మనీశ్ తివారీ విమర్శించారు. ఈ పరిణామాన్ని కేంద్రం రాజకీయం చేయాలనుకోవడం దురదృష్టకర, విచారకరమన్నారు. రాజకీయ కారణాలతోనే ప్రస్తుత సెన్సార్ బోర్డులో నియామకాలు జరిగాయని ప్రభుత్వం ఒకవేళ భావిస్తే గత ఎనిమిది నెలల్లోనే బోర్డు సభ్యులపై ఎందుకు వేటు వేయలేదని ప్రశ్నించారు.
 
  సినిమాలో ఏముంది..?
 ‘ద మెసెంజర్ ఆఫ్ గాడ్(దేవ దూత)’. కథ విషయానికి వస్తే.. పెద్ద సంఖ్యలో భక్తులు, అనుచరులు ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక నేత గురూజీ ఈ సినిమాలో హీరో. డ్రగ్స్, లింగ వివక్ష, మద్యపానం, వ్యభిచారం వంటి సామాజిక రుగ్మతలు రూపుమాపి, యువతను ఉద్ధరిస్తానంటూ గురూజీ సవాల్‌ను స్వీకరిస్తాడు. అయితే, సమాజానికి మంచి చేయడం సహించలేని కొందరు గురూజీని చంపేందుకు కుట్రలు పన్నడం, వాటిని గురూజీ ఎదుర్కోవడం. స్థూలంగా ఇదీ కథ. అయితే, ఈ సినిమా ద్వారా గుర్మీత్ సింగ్ తనను తాను దేవుడిగా చిత్రీకరించుకున్నట్లుగా ఉందని సెన్సార్ బోర్డు సభ్యులు భావించినట్లు సమాచారం. చిత్రంలో తర్కవిరుద్ధమైన గురూజీ లీలలపైనా అభ్యంతరాలు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు.. డేరా వర్గానికి, సిక్కు సంస్థలు దళ్ ఖల్సా, శిరోమణి అకాలీదళ్‌లకు ఎప్పుడూ పొసగని కారణంగా కూడా ఈ సినిమాపై వ్యతిరేకత, నిరసనలు పెరగడానికి దారితీసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement