
‘జయలలిత అనారోగ్యంపై వదంతులు’
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు ప్రభుత్వం అడ్డుకట్టవేయాల్సిన అవసరముందని డీఏంకే అధినేత ఎం. కరుణానిధి అన్నారు. జయలలిత అనారోగ్యంకు సంబంధించిన వివరాలు వెల్లడించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
‘గతంలోనే చెప్పినట్టుగా జయలలిత సిద్ధాంతాలతో నేను విభేదిస్తున్నాను. అయితే అనారోగ్యం బారిన పడిన ఆమె త్వరగా కోలుకుని అధికార విధులకు హాజరు కావాలని కోరుకుంటున్నాను. జయలలిత అనారోగ్యంపై కొంతమంది అవాంఛిత వదంతులు ప్రచారం చేస్తున్నందున అపోలో ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్లు విడుదల చేయాల’ని ఆయన సూచించారు.
‘సోషల్ మీడియాలో కొంత మంది వ్యక్తులు జయలలిత ఆరోగ్యంపై పుకార్లు సృష్టిస్తున్నారు. అధికారిక ప్రకటన చేసి వీటికి అడ్డుకట్టవేయాలి. ఆస్పత్రిలో ఉన్న జయలలిత ఫొటోలు మీడియాకు విడుదల చేసి వదంతులు వ్యాపింపజేయకుండా చేయాల’ని కరుణానిధి అన్నారు. 68 ఏళ్ల జయలలిత జ్వరం, డీహైడ్రేషన్ కారణంగా ఈ నెల 22న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. మరిన్ని రోజులు చికిత్స అవసరమని ఆమెకు వైద్యులు సూచించారు.