కొండచిలువ భారీ దుప్పిని మింగి.. చివరికిలా
అహ్మదాబాద్: తాను తినగలిగిందానికంటే ఎక్కువ పరిమాణంలో ఉన‍్న దుప్పిని మింగిన పైథాన్(కొండచిలువ) చివరికి ప్రాణాలను కోల్పోయింది. ఈ ఘటన గుజరాత్లోని గిర్ వన్యప్రాణీ సంరక్షణ కేంద్రం సమీపంలో చోటుచేసుకుంది. జగన్నాధ్ జిల్లాలోని బలియవాడ్ గ్రామంలో 20 అడుగుల కొండచిలువ ఓ భారీ దుప్పిని మింగింది. అనంతరం దానిని అరిగించుకోవడంలో విఫలమైందని స్థానిక అటవీశాఖ అధికారులు వెల్లడించారు.
సాధారణంగా ఇలాంటి భారీ పరిమాణంలో ఉన్న జంతువులను అహారంగా తీసుకున్న సమయంలో అది జీర్ణం కావడానికి కొండచిలువలకు కొన్ని రోజులు పడుతుంది. కొన్నిసార్లు పూర్తిగా జీర్ణమవడానికి కొన్ని వారాలు కూడా పట్టొచ్చు. అయితే భారీ పరిమాణంలో ఉన్న ఆ దుప‍్పిని మింగడం మూలంగా పైథాన్కు అంతర్గతంగా గాయాలయ్యాయని అందుకే అది మరణించిందని అధికారులు వెల్లడించారు.
దుప్పిని మింగిన అనంతరం రోడ్డుపై కదలలేని స్థితిలో ఉన్న పైథాన్ను గ్రామస్తులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే.. పైథాన్ను రక్షించే ప్రయత్నం చేసేలోపే అది మరణించిందని అధికారులు వెల్లడించారు. ఇంత భారీ పరిమాణంలో ఉండే కొండచిలువలు చాలా అరుదు అని, అది మరణించడం బాధాకరమని వారు వాపోయారు.