
ఇది మరో రష్యా కోడలి ప్రేమకథ
న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ జోక్యంతో ఓ రష్యన్ యువతి కాపురం చక్కబడగా తాజాగా మరో రష్యా యువతి కథనం బయటకు వచ్చింది. అయితే, ఇందులో విషాదం లేదు.. అంతా సంతోషమే. భారత సంప్రదాయం చాలా గొప్పదని ఇక్కడ తనకు ప్రశాంతత దొరకడంతోపాటు ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే భర్త కూడా దొరికాడని ఆమె చెప్పుకొచ్చింది. రష్యాలో డెంటిస్టుగా పనిచేస్తున్న తాతియానా జురిలోవా అనే రష్యన్ యువతికి యోగా అంటే చాలా ఇష్టం. ఆమె రష్యాలో బేసిక్స్ నేర్చుకుంది. మరింత నేర్చుకునేందుకు ఇండియా వెళ్లాలని ఆమె గురువు సలహా ఇవ్వడంతో డిసెంబర్ 2014లో ఢిల్లీకి వచ్చింది.
అనంతరం రిషికేశ్ కు వెళ్లిన ఆమె ప్రాణయామ, ఆసనాలు, మెడిటేషన్ వంటివి నేర్చుకుంది. అయితే, మరింత లోతుగా నేర్చుకునేందుకు వారణాసిలో ఓ టీచర్ ఉన్నాడని తెలుసుకొని ఆమె అక్కడికి బయల్దేరింది. అయితే, అప్పుడే జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఓ సెమినార్ కార్యక్రమానికి వెళ్లొస్తున్న మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. అతడు వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిశ్వవిద్యాలయం(బీహెచ్యూ)లో స్కాలర్ కావడంతో ఇద్దరు కలిసి వారణాసి వెళ్లారు.
అలా వారి పరిచయం మొదలైంది. కొద్ది రోజులపాటు యోగా నేర్చుకున్న ఆమె తిరిగి రష్యా వెళ్లిపోయింది. అనంతరం వారిద్దరు ప్రతి రోజు ఫేస్ బుక్ లో చాట్ చేసుకున్నారు. తొలుత చంద్రశేఖర్ ప్రపోజ్ చేయగా ఆమె నిరాకరించింది. కానీ, కొద్ది రోజుల తర్వాత ఓకే చెప్పింది. దీంతో వారిద్దరు 2015 జూలైలో పెళ్లి చేసుకున్నారు. ఇలా యోగా తనకు ఎలా జీవితాన్ని ఇచ్చిందో ఆమె మీడియాకు చెప్పింది.