
సాక్షి, న్యూఢిల్లీ : సత్వర సాగు ప్రయోజన పథకం (ఏఐబీపీ) కింద తెలంగాణలో ఎంపిక చేసిన 11 ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలంటే కేంద్రం నాబార్డు ద్వారా పూర్తిస్థాయిలో రుణం ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. దీన్ని ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితి పరిధిలోకి తీసుకురాకుండా మంజూరు చేయాలని సూచించారు. ఏఐబీపీ కింద ఎంపిక చేసిన ప్రాజెక్టులపై వివిధ రాష్ట్రాల నీటిపారుదలశాఖ మంత్రులతో గురువారం ఢిల్లీలో కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమావేశం నిర్వహించారు. ఏఐబీపీ కింద మొదటి దశలో ఎంపిక చేసిన ప్రాజెక్టుల పనుల్లో పురోగతిపై ఈ భేటీలో గడ్కరీ సమీక్షించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర హరీశ్‌రావు ప్రాజెక్టుల సత్వర పూర్తికి కేంద్రానికి పలు సూచనలు ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టుల ప్రణాళికలు, డిజైన్లను రాష్ట్ర ప్రభుత్వమే చేసుకుంటోందని, కేంద్రం ఆయా ప్రాజెక్టులకు గ్రాంట్స్ రూపంలో కూడా నిధులు ఇవ్వడం లేదన్నారు. అందువల్ల కనీసం రుణంగా ఇచ్చే నిధులనైనా వేగంగా ఒకేసారి పూర్తి స్థాయిలో నాబార్డు ద్వారా విడుదల చేయించాలని హరీశ్ సూచించారు. 11 ప్రాజెక్టుల్లో ప్రస్తుతానికి రెండు ప్రాజెక్టులు పూర్తయ్యాయని, మరో ఆరు ప్రాజెక్టులను జూన్ నాటికి పూర్తి చేసి మిగిలిన వాటిని వచ్చే ఏడాది మార్చికల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
దేవాదుల ప్రాజెక్టుకు రావాల్సిన రూ. 450 కోట్ల నిధుల ప్రతిపాదనలు, భీమా ప్రాజెక్టుకు రావాల్సిన రూ. 35 కోట్ల ప్రతిపాదనలు కేంద్రం వద్ద ఉన్నాయని, వాటిని ఆమోదించాలని కేంద్ర మంత్రిని కోరారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి తీసుకురాకుండా నాబార్డు ద్వారా రుణం మంజూరుకు సంబంధించి ఒక నోట్ తయారు చేయాలని.. దీన్ని ప్రధాని, కేబినెట్ ముందు ప్రవేశపెట్టి నిర్ణయం తీసుకుంటామని గడ్కరీ హామీ ఇచ్చినట్లు ఈ భేటీ అనంతరం హరీశ్ మీడియాకు తెలిపారు.
నీటి లెక్కలు తేల్చకుండా సరికాదు..
బ్రిజేశ్ ట్రిబ్యునల్ అవార్డు పెండింగ్‌లో ఉండగా ప్రాజెక్టులను కృష్ణా నది బోర్డు పరిధిలోకి తీసుకురావడం సరికాదని హరీశ్ పేర్కొన్నారు. తొలుత నీటి కేటాయింపుల గురించి తేల్చాలని కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి యూపీ సింగ్ అధ్యక్షతన జరిగిన గోదావరి, కృష్ణా బోర్డుల సమావేశంలో చెప్పామన్నారు. ఏపీ సర్కారు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా మళ్లిస్తున్న నీటిలో తెలంగాణకు 45 టీఎంసీల హక్కు ఉందని, ఈ లెక్క తేల్చాలని కోరామన్నారు.
నీటి లెక్కలు తేల్చిన తరువాత ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావడం వల్ల బోర్డు కూడా రెగ్యులేట్ చేయగలుగుతుందని అన్నారు. తెలంగాణలో రాష్ట్ర పరిధిలోనే కాళేశ్వరం ద్వారా నీటి మళ్లింపు ఉంటుంది కాబట్టి ఇందులో ఏపీకి హక్కు ఉంటుందని చెప్పడం అవగాహనరాహిత్యమని హరీశ్ పేర్కొన్నారు. సమావేశం అసంపూర్తిగా ముగిసిందని, తుదుపరి భేటీలో నీటి లెక్కలపై స్పష్టత వస్తుందని ఆశిస్తున్నామన్నారు.
ప్రాజెక్టులకు తెలంగాణ పెద్దపీట వేస్తోంది: గడ్కరీ
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధపై కేంద్ర మంత్రి గడ్కరీ ప్రత్యేకంగా ప్రశంసించారు. సాగునీటి రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత వల్ల భవిష్యత్తులో తెలంగాణ సత్ఫలితాలు అందుకుంటుందన్నారు. సాగునీటి రంగానికి ప్రాధాన్యం విషయంలో ఇతర రాష్ట్రాలు తెలంగాణను చూసి నేర్చుకోవాలని సూచించారు. బిహార్‌కు సంబంధించిన ఏఐబీపీ ప్రాజెక్టుల పనులపై సమీక్ష సందర్భంగా గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు.
పాలమూరుకు అటవీ అనుమతులివ్వండి
పాలమూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించి తొలి దశ అటవీ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి హర్షవర్ధన్‌ను మంత్రి హరీశ్‌రావు కోరారు. కేంద్ర మంత్రిని ఆయన కార్యాలయంలో కలుసుకున్న హరీశ్‌రావు... పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు, సీతారామ ఎత్తిపోతల పథకానికి వన్యప్రాణి బోర్డు నుంచి రావాల్సిన అనుమతులపై చర్చించారు.
సీతారామ ప్రాజెక్టు అనుమతులకు సంబంధించి ఈ నెల్లో బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి అనుమతులు ఇవ్వాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హర్షవర్ధన్...అనుమతుల మంజూరుపై అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు హరీశ్‌రావు మీడియాకు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు ఆహ్వానించగా గడ్కరీ, హర్షవర్ధన్ సానుకూలంగా స్పందించారన్నారు.