
రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా ‘ఎట్‌హోం’
క్విట్ ఇండియా 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రాష్ట్రపతి భవన్‌లో ‘ఎట్‌హోం’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సాక్షి, న్యూఢిల్లీ: క్విట్ ఇండియా 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రాష్ట్రపతి భవన్‌లో ‘ఎట్‌హోం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవలే నూతన రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన రామ్‌నాథ్ కోవింద్‌కు ఇది తొలి అధికారిక కార్యక్రమం అయిన నేపథ్యంలో కేంద్రం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు స్వాతంత్య్ర సమరయోధులను రాష్ట్రపతి కోవింద్ ఘనంగా సన్మానించారు.
తెలంగాణ నుంచి 9 మంది సమరయోధులు రాష్ట్రపతి నుంచి సన్మానం పొందారు. వరంగల్‌కు చెందిన బి.శ్రీనివాస్, కె.కొమరయ్య, బి.మురహరి, వేములపల్లి నారాయణ, కరీంనగర్ జిల్లా నుంచి రామలింగయ్య, రామానుజం, ఎర్రబెల్లి రంగారావు, బాల పాపిరెడ్డి (జనగాం) కిషన్‌రావు (జయశంకర్ భూపాలపల్లి) వీరిలో ఉన్నారు. దేశంకోసం పోరాడిన తమకు రాష్ట్రపతి నుంచి గౌరవం దక్కడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు సంతోషం వ్యక్తం చేశారు.