సాక్షి, చండీగఢ్ : డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన జర్నలిస్టులు, హర్యానా పోలీస్ అధికారులు, డేరా మాజీ అనుచరులను చంపేస్తామని డేరా ఖుర్బానీ విభాగం హెచ్చరించింది. పాలక బీజేపీ, హర్యానా ప్రభుత్వాలు డేరా సచా సౌథాను మోసం చేశాయని కూడా ఖుర్బానీ విభాగం రాసిన లేఖలో ఆరోపించింది. గుర్మీత్ సింగ్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన వారిపై ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్న 200 మంది పిల్లలు ప్రతీకారం తీర్చుకుంటారని పేర్కొంది. ఈ లేఖను రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా చండీగఢ్‌లోని పలు మీడియా కార్యాలయాలకు చేరవేశారు.
గతంలో డేరా సచ్చా సౌదాతో సంబంధం ఉన్న కొందరు తమ పత్రికల ద్వారా డేరా మద్దతుదారులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. అయితే డేరా ఖుర్బానీ విభాగం జారీ చేసిన హెచ్చరిక లేఖలపై హరియాణా పోలీసులు విచారణ చేపట్టారు. అత్యాచార కేసుల్లో దోషిగా తేలిన రామ్ రహీం సింగ్ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయనను కోర్టు దోషిగా నిర్ధారించిన తర్వాత హరియణాలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. డేరా బాబా మద్దతుదారులు జరిపిన దాడుల్లో భారీగా ఆస్తినష్టం సంభవించింది. పలువురు ప్రాణాలు కోల్పోయారు.