న్యూఢిల్లీ: రాజమండ్రిలోని జాతీయ పొగాకు పరిశోధన సంస్థ(సీటీఆర్‌ఐ)కు చెందిన 21.93 ఎకరాల స్థలాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయం కోసం బదిలీ చేస్తూ కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు సోమవారం ఒక పత్రికాప్రకటనను విడుదల చేశారు. సీటీఆర్‌ఐ ప్రాంగణంలో నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని వ్యవసాయ యూనివర్సిటీ కోసం బదిలీ చేయాల్సిందిగా కోరుతూ వెంకయ్యనాయుడు జూన్ 2న రాధామోహన్ సింగ్‌కు లేఖ రాశారు. దానిపై స్పందించిన రాధామోహన్ సింగ్.. వెంకయ్యనాయుడిని సోమవారం కలసి ఆయన అభ్యర్థనను ఆమోదించామని తెలిపారు. ఈ సందర్భంగా ఏపీలోని తూర్పుగోదావరి, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో.. తెలంగాణలోని కరీంనగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కృషి విజ్ఞాన్ కేంద్రాలు(కేవీకే) ఏర్పాటు చేయాలని వెంకయ్యనాయుడు కోరారు. ఇందుకు రాధామోహన్ సానుకూలంగా స్పందించారని ఆ ప్రకటనలో వెల్లడించారు.