![Rahul Gandhi And Opposition Delegation Sent Back From Srinagar - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/24/rahul_0.jpg.webp?itok=6qx_baiJ)
శ్రీనగర్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు ఇతర విపక్షాల నేతలను జమ్మూ కశ్మీర్ అధికారులు శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారు. అనంతరం వీరిని వెనక్కి పంపించినట్లు సమాచారం. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లోయలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కశ్మీర్‌లో ప్రశాంత వాతావరణం ఉందని, కావాలనుకుంటే ఇక్కడ పర్యటించవచ్చునని విపక్షాలకు సూచించారు.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సహా ఆర్జేడీ, ఎన్సీపీ, టీఎంసీ, డీఎంకే, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన పలువురు నేతలు శనివారం కశ్మీర్ పర్యటనకు బయల్దేరారు. అయితే వీరంతా అక్కడ పర్యటించేందుకు కశ్మీర్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. అంతేగాక జాతీయ నేతలు పర్యటించాలనుకున్న ప్రాంతాల్లో ముందుగానే 144 సెక్షన్‌ను అమలు చేశారు. అనుమతి లేనప్పటికీ విపక్ష నేతల బృందం ఢిల్లీ నుంచి శ్రీనగర్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ క్రమంలో వారిని అడ్డగించిన అధికారులు తిరిగి పంపించివేశారు. కాగా ఈ విషయంపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించింది. ఈ మేరకు...‘ కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగా జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితి సాధారణంగానే ఉంటే రాహుల్ గాంధీ నేతృత్వంలో అక్కడికి వెళ్లిన విపక్ష నేతల బృందాన్ని శ్రీనగర్ ఎయిర్‌పోర్టు నుంచే ఎందుకు వెనక్కి పంపారు. మోదీ ప్రభుత్వం ఏ విషయాన్ని దాయడానికి ఇంతలా ప్రయత్నిస్తోంది’ అని అధికారిక ట్విటర్ ఖాతాలో ప్రశ్నించింది.
If the situation in Jammu & Kashmir is "normal" as the govt claims, why has the delegation of Opposition leaders led by Shri @RahulGandhi been sent back from Srinagar airport?
— Congress (@INCIndia) August 24, 2019
What is the Modi govt trying to hide? #RahulGandhiWithJnK
ఇక విపక్ష నేతల పర్యటనపై అధికార బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రశాంతంగా ఉన్న కశ్మీర్‌లో అల్లర్లు సృష్టించడానికే నేతలు అక్కడ పర్యటిస్తున్నారని విమర్శిస్తోంది. కాగా జాతీయ నేతల పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం.. లోయలో శాంతి, భద్రతల పునరుద్ధరణ కొనసాగుతున్న వేళ తమ పర్యటనను రద్దు చేసుకోవాలని కోరింది. కశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో ఇంకా నిషేదాజ్ఞలు కొనసాగుతున్నాయి కాబట్టి తాజా పర్యటన.. నిబంధనలు ఉల్లంఘించినట్లే అవుతుందని ప్రకటించింది. శాంతి, భద్రతల పునరుద్ధరణకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని పర్యటనను రద్దు చేసుకోవాలని కశ్మీర్ పాలనా అధికారులు వీరిని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment