సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణను ఎత్తివేసి ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టి ఈ రోజుకు మూడు వారాలు అంటే, సరిగ్గా 21 రోజులు. ఇది జరిగిన ఆగస్టు ఐదవ తేదీన రాష్ట్రంలోని ల్యాండ్ ఫోన్, మొబైల్ ఫోన్ సర్వీసులతోపాటు ఇంటర్నెట్, తపాలా సర్వీసులను కూడా నిలిపివేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ అత్యయిక పరిస్థితులే కొనసాగుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కశ్మీర్‌లో సాధారణ పరిస్థిలు నెలకొన్నాయని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతోంది. కేంద్రం దష్టిలో సాధారణ పరిస్థితులంటే ఏమిటీ ? ఈ ప్రశ్నలకు బదులేది ?
- కశ్మీర్ పరిస్థితి ప్రత్యక్షంగా పరిశీలించేందుకు రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నాయకులందరికి శ్రీనగర్ విమానాశ్రయంలోనే ఎందుకు నిలిపివేశారు. వారిని నగరంలోకి ఎందుకు అనుమతించలేదు ?
- ల్యాండ్‌లైన్ ఫోన్ సర్వీసులను పునరుద్ధరించామని ప్రభుత్వం చెబుతోంది. మరి అలాంటప్పుడు కశ్మీర్‌కు ఒక్క ఫోన్‌కూడా కలవడం లేదని దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఇప్పటికీ ఎందుకు ఫిర్యాదులు వస్తున్నాయి ? శ్రీనగర్‌లోని సెంట్రల్ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఎందుకు మూసి ఉంది ?
- రాష్ట్ర యంత్రాంగం శ్రీనగర్‌లోని కొన్ని చోట్ల ప్రత్యేక ఫోన్ కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఎంతో దూరంలో ఉన్న ఆ అయిదు ఫోన్ల వద్దకు కాలి నడకన వెళ్లి రోజుకు 500 మంది చొప్పున ఫోన్ సర్వీసులను ఉపయోగించుకుంటున్నారు.
- ఇంటర్నెట్ సర్వీసులు, బ్రాడ్ బ్యాండ్ సర్వీసులుగానీ తపాలా సర్వీసులు కూడా ఇంకా నడవడం లేదు.
- కొన్ని వార్తా పత్రికలు మాత్రమే పరిమిత సంఖ్యలో ముద్రణ కొనసాగిస్తున్నాయి. ఇప్పటికీ వారి వెబ్‌సైట్స్, సోషల్ మీడియా పేజెస్ అప్‌డేట్ అవడం లేదు.
- జర్నలిస్టులను వార్తా సేకరణ కూడా చాలా కష్టమవుతోంది. వారంతా నాలుగు కంప్యూటర్లు, ఓ మొబైల్ టెలిఫోన్ సౌకర్యం కలిగి. ప్రభుత్వ మీడియా సెంటర్‌పై ఆధారపడి పనిచేస్తున్నారు.
- ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు సహా కొన్ని వందల మంది రాజకీయ నాయకులు ఇప్పటికీ గహ నిర్బంధంలోనే ఉన్నారు. వారికి వారి కుటుంబాలను కలుసుకునే అవకాశం నేటికి ఇవ్వడం లేదు.
- ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యాలయం మినహా మినహా మిగతా పార్టీ కార్యాలయాలన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి.
- కశ్మీర్‌లో నాలుగువేల మందికి పైగా నిర్బంధంలోకి తీసుకొని స్థలా భావం వల్ల వారిని రాష్ట్రం బయటకు తరలించినట్లు ఓ అధికారి తెలిపారు. నిర్బంధంలోని తీసుకున్న వారిలో వ్యాపారస్థులు, ఉద్యోగులు కూడా ఉండడం గమనార్హం.
- రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష పార్టీ నేతల బందంతోని వచ్చిన మీడియా ప్రతినిధుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడమే కాకుండా చేయి కూడా చేసుకున్నారు. స్థానిక మీడియా ప్రతినిధులను వీధుల్లోకి కూడా అనుమతించడం లేదు.
- రాళ్లు రువ్విన, పోలీసుల లాఠీఛార్జీ ఘటనల్లో గాయపడిన వారిలో 150 మంది ప్రస్తుతం శ్రీనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
- మార్కెట్లు అన్నీ బంద్ ఉన్నాయి. మెడికల్ షాపులు మాత్రమే తెరచి ఉంటున్నాయి.
- ప్రభుత్వ సర్వీసులేవీ నడవడం లేదు. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉంటున్నాయి. అక్కడక్కడా, అప్పుడప్పుడు ప్రైవేటు టాక్సీలు కనిపిస్తున్నాయి.
- విధులకు హాజరు కావాలంటూ స్థానిక అధికార యంత్రాంగం ఎన్నిసార్లు పిలుపునిచ్చినప్పటికీ ప్రభుత్వ కార్యాలయాలు ఉద్యోగులులేక వెలవెల బోతున్నాయి.
- లాంఛనంగా పాఠశాలలను తెరచినప్పటికీ పిల్లలు వెళ్లడం లేదు. అందుకు వారిని తల్లిదండ్రులు అనుమతించడం లేదు.
- జబ్బు పడిన వారు అంబులెన్స్‌లు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment