శ్రీనగర్: రెండేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్ పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తిరిగి తన సొంత ఉంటికి వచ్చినట్టుందని అన్నారు. శ్రీనగర్‌లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రాహుల్ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ‘నా కుటుంబం ఢిల్లీలో నివసిస్తోంది. అంతకు ముందు అలహాబాద్‌లో ఉండేవారు. దానికంటే ముందు నా కుటుంబం కశ్మీర్‌లోనే ఉండేది. నా తాత ముత్తాతలు ఈ జీలం నది నీళ్లు తాగే బతికారు. అందుకే కశ్మీరీయత్ (ఈ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలు) నా నరాల్లో ఎంతో కొంత జీర్ణించుకొని పోయింది. ఇక్కడికి రాగానే తిరిగి సొంతింటికి వచ్చిన అనుభూతి కలిగింది’’ అని రాహుల్ ఉద్వేగభరితంగా మాట్లాడారు.
ప్రేమ, గౌరవం ఈ రెండింటి ద్వారానే ఏదైనా సాధించాలి తప్ప విద్వేషం, బలవంతంతో ఒరిగేదేమీ లేదన్నారు. ‘‘కశ్మీర్‌కు లోక్‌సభలో ఎక్కువ స్థానాలు లేవు. ప్రస్తుతం దీనికి రాష్ట్ర హోదా కూడా లేదు. కానీ మీ సంస్కృతి సంప్రదాయాలే కశ్మీర్‌కు బలం. కశ్మీరీయత్ దేశానికి పునాది వంటిది. ఆ భావం నాలో కూడా ఉంది. అందుకే ప్రేమ, గౌరవం అనే సందేశాన్ని ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాను’’ అని రాహుల్ అన్నారు. 2019 ఆగస్టులో కేంద్రం కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత రాహుల్ గాంధీ శ్రీనగర్‌కు వస్తే అధికారులు విమానాశ్రయం నుంచి ఆయన్ను వెనక్కి పంపేవారు. ఈ విషయాన్ని గుర్తు చేసిన రాహుల్ జమ్మూ, లద్దాఖ్‌లలో కూడా పర్యటిస్తానని చెప్పారు.
ప్రధాని విభజన సిద్ధాంతంపై పోరాటం కొనసాగుతుంది: రాహుల్
సమాజాన్ని విభజించాలని చూస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిద్ధాంతాలపై తమ పోరాటం కొనసాగుతుందని రాహుల్ గాంధీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో పెగసస్, రైతు సమస్యలు, అవినీతి ఇలా ఏ అంశంపైనా చర్చకు అంగీకరించడం లేదని విరుచుకుపడ్డారు. ప్రధాని విభజన సిద్ధాంతాలతో దేశమే ముక్కలయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘బీజేపీ మన వ్యవస్థలపై దాడి చేస్తోంది. న్యాయవ్యవస్థ, అసెంబ్లీ, పార్లమెంటు ఇలా అన్నింటిపైనా దాడికి దిగుతోంది. చివరికి మీడియాను కూడా తన గుప్పిట్లో ఉంచుకుంది. మీడియా మిత్రుల్ని బెదిరిస్తూ ఉండటంతో వారు తమ విధుల్ని కూడా నిర్వహించలేకపోతున్నారు. ఇది దేశంపై జరుగుతున్న దాడి’’ అని రాహుల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఎన్నికలకు ముందే రాష్ట్ర హోదా ఇవ్వాలి
జమ్ము కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించడానికి ముందే రాష్ట్ర హోదా కట్టబెట్టాలని రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ముందుగా రాష్ట్ర హోదా పునరుద్ధరించాక ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ప్రక్రియ అని అన్నారు. అంతకు ముందుమాతా ఖీర్ భవానీ అలయాన్ని రాహుల్ సందర్శించి పూజలు చేశారు.
శ్రీనగర్‌లో కొత్తగా ఏర్పాటైన పీసీసీ కార్యాలయంలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ
Comments
Please login to add a commentAdd a comment