'నమ్మించి మోసం చేసిన మమత'
కోల్ కతా: 'ఐదేళ్ల క్రితం 70 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని, శాంతిభద్రతలను కాపాడుతామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయారు. ఇప్పుడు మళ్లీ కొత్త హామీలు ఇస్తున్నారు. ఒక వేళ మళ్లీ అధికారంలోకి వస్తే ఈసారి కూడా ఆమెకు హామీలు గుర్తుండవు' అంటూ టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. 'మమత మాటలు నమ్మి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆమెకు మద్దతు ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చాక హామీలకు నీళ్లొదిలారు' అని రాహుల్ విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రఘునాథ్ గంజ్ లో ప్రచారం నిర్వహించిన రాహుల్ గాంధీ తన ప్రసంగాల్లో ఆద్యాంతం టీఎంసీపై విమర్శలు గుప్పించారు. బెంగాల్ కు పరిశ్రమలు రాలేదని, యువతకు ఉపాధి లేక పొరుగు రాష్ట్రాలకు నిరుద్యోగులు తరలివెళుతున్నారన్న ఆయన వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని మమతను ఓడించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో నరేంద్రమోది, రాష్ట్రంలో మమతా బెనర్జీ రైతులకు చేసిందేమీలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే శారదా కుంభకోణం నిందితులను శిక్షిస్తామని చెప్పారు.