
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. లాక్‌డౌన్ అమలుపై మోదీ సర్కార్‌ను విమర్శించే క్రమంలో రాహుల్ ఈసారి ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వ్యాఖ్యలను ఉటంకించారు. అజ్ఞానం కంటే అహంభావం మరింత ప్రమాదకరమని లాక్‌డౌన్ నిరూపించిందని ఐన్‌స్టీన్ కోట్‌ను ప్రస్తావిస్తూ రాహుల్ సోమవారం ట్వీట్ చేశారు. ట్వీట్‌తో పాటు కోవిడ్-19 మరణాలు పెరగడం, ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమవుతున్న తీరును వివరించే లైవ్ గ్రాఫ్‌ను రాహుల్ పోస్ట్ చేశారు.
దేశవ్యాప్తంగా కఠిన లాక్‌డౌన్ అమలుచేయడంతో ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావానికి లోనైందని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కోవిడ్-19తో ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొనే ప్రతికూల ప్రభావంపై రాహుల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేథావులు, విధాన నిర్ణేతలతో మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. రాహుల్ ఇప్పటివరకూ ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ, పారిశ్రామికవేత్త రాజీవ్ బజాజ్, అమెరికన్ దౌత్యవేత్త నికోలస్ బర్న్స్, హార్వర్డ్ ప్రొఫెసర్ ఆశిష్ ఝా, స్వీడన్ వైద్యులు జోహన్ గికీలతో మాట్లాడారు. వీరితో సంప్రదింపులు జరిపే క్రమంలో కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు..ఇతర దేశాలు అనుసరిస్తున్న విధానాల గురించి విస్తృతంగా చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment