
బీజేపీవి నెత్తుటి రాజకీయాలు
రాహుల్ గాంధీ నిప్పులు
కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు
కోర్టులు ఆదేశిస్తే తప్ప
మోడీ లోకాయుక్త ఏర్పాటు చేయలేదు
అవినీతి వ్యతిరేక బిల్లులకు బీజేపీ సహకరించ లేదు
అందుకే ఆర్డినెన్స్‌లుగా తేవాలనుకుంటున్నాం
డెహ్రాడూన్: ఏ రకంగానైనా సరే అధికారంలోకి రావాలన్న పదవీ వ్యామోహంతో బీజేపీ నెత్తుటి రాజకీయాలు చేస్తోందని కాం గ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ‘‘అది(బీజేపీ) నెత్తుటి రాజకీయాలు చేస్తోంది. ఎలాగైనా అధికారంలోకి వచ్చేయాలన్న ఆలోచన తప్ప వాళ్ల కంటికి మరొకటి కనిపించడంలేదు. అధికారంలోకి రావడానికి అవసరం అనుకుంటే ఒక మతంపైకి మరో మతాన్ని, ఒక కులంపైకి మరో కులాన్ని ఉసిగొల్పి రక్తం కళ్లచూడ్డానికి కూడా వెనుకాడరు వారు’’ అని ఆయన అన్నారు. అదే కాంగ్రెస్ అయితే ప్రజల బాధలను అర్థం చేసుకుని వారి కోసం కృషి చేస్తుందన్నారు. ఆదివారం డెహ్రాడూన్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన సభలో రాహుల్ మాట్లాడారు. కొన్ని సార్లు ప్రజల ఆకాంక్షలకు తగినట్టుగా తమ పాలన ఉండకపోవచ్చని, అయితే దేశం అభివృద్ధి పథంలో పయనించాలంటే దానికి అవసరమైన దూరదృష్టి కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని చెప్పారు.
మోడీపైనా విమర్శలు..: బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీపై రాహుల్ విరుచుకుపడ్డారు. ‘‘ఆ గుజరాత్ ముఖ్యమంత్రి అవినీతి గురించి మాట్లాడుతున్నారు. తీరా చూస్తే ఆయన తన రాష్ట్రంలో లోకాయుక్త ఏర్పాటుకే ముందుకురాలేదు. జ్యుడీషియల్ ఉత్తర్వులు వెలువడితేగాని ఏర్పాటు చేయలేదు. అయినప్పటికీ గుజరాత్‌లో ఒకే ఒక్క మనిషి మాత్రం లోకాయుక్త పరిధిలోకి రాలేదు. అందరూ వచ్చారుగాని.. ఆ ఒక్కరూ మాత్రం కాదు’’ అంటూ మోడీపై రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. పెండింగ్‌లో ఉన్న ఆరు అవినీతి వ్యతిరేక బిల్లులను ఆమోదించే విషయంలో బీజేపీ సహకరించడం లేదన్నారు. దీంతో వేరే దారిలేక తాము ఆర్డినెన్స్‌ల రూపంలో వాటిని తేవడానికి యత్నిస్తున్నామన్నారు. కాంగ్రెస్ రహిత భారత్ అంటూ మోడీ దుష్ర్పచారం చేస్తున్నారని, కానీ తమ పార్టీని దేశం నుంచి వేరు చేయలేరని అన్నారు. ‘‘మేం ఆలోచనల గురించి మాట్లాడతాం. వాళ్లేమో కాంగ్రెస్‌ను రూపుమాపాలని అంటారు. వాళ్లు భగవద్గీత చదవాలి. కానీ చదవరు. మానవత్వంతో ఇతరుల కోసం పని చేయాలని గీత చెబుతోంది. బుద్ధుడిని, అశోకుడిని, అక్బర్‌ను రూపుమాపలేరు.. అలాగే కాంగ్రెస్‌ను కూడా చెరిపేయలేరు. మేం పోరాడతాం. గెలుస్తాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’’ అని అన్నారు. బీజేపీ వారెప్పుడూ సమస్యల గురించి, ప్రజల గురించి మాట్లాడరని, తమ నేతను ప్రధానిని చేస్తే చాలు అన్ని సమస్యలూ పరిష్కారమైపోతాయని చెబుతుంటారని దుయ్యబట్టారు.