రాహుల్ పట్టానికి రంగం సిద్ధం
వచ్చేనెల 17న ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం
రాహుల్‌గాంధీని కాంగ్రెస్ తన ప్రధాని అభ్యర్థిగా ప్రకటించబోతోందా? ఢిల్లీ పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. వచ్చేనెల 17న ఏఐసీసీ సమావేశం జరగబోతోంది. వెయ్యి మంది పార్టీ ప్రతినిధులు తరలిరానున్నారు. ఈ సందర్భంగానే రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించబోయే వ్యూహాలను చర్చించేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది ప్రకటించినా రాహుల్‌కు పట్టం కోసమే భేటీని ఏర్పాటు చేసినట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దెబ్బతినడం తెలిసిందే. ఫలితాల తర్వాత రాహుల్‌తో కలిసి విలేకరులతో మాట్లాడిన సోనియాగాంధీ.. సరైన సమయంలో పార్టీ ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. ఓవైపు బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థి మోడీ దూసుకుపోతుంటే కాంగ్రెస్ తన అభ్యర్థి విషయంలో తాత్సారం చేయడం పనికిరాదని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు యూపీఏ భాగస్వామ్య పక్షాలు కూడా ధిక్కార స్వరం వినిపిస్తున్నాయి. తాము వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోబోమని డీఎంకే ప్రకటించగా.. ప్రజలు బలహీనమైన నాయకత్వాన్ని కోరుకోవడం లేదంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రధాని అభ్యర్థి విషయంలో ఇంకా ఆలస్యం చేయడం సరికాదని కాంగ్రెస్ భావిస్తోంది.