ఢిల్లీ వీధుల్లో కలియతిరిగిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం తెల్లవాముజామున ఢిల్లీ వీధుల్లో కలియతిరిగారు. సామాన్యులు పడుతున్న నోట్ల కష్టాలను ప్రత్యక్షంగా చూశారు. పాత పెద్ద నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో సామాన్య జనం ఎటువంటి బాధలు అనుభవిస్తున్నారో తెలుసుకునేందుకు పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఏటీఎంల ముందు బారులు తీరిన ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు.
జహంగీర్ పూరి, ఇంద్రలోక్, జకీరా, ఆనంద్ పరబాత్ ప్రాంతాల్లో రాహుల్ గాంధీ పర్యటించారు. ఏటీఎం ముందు క్యూలో నిలబడిన ప్రజలతో మాట్లాడారు. పాత పెద్ద నోట్ల ఉపసంహరణతో పడుతున్న వెతలను రాహుల్ కు సామాన్యులు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో తాము తీవ్ర కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
వారు చెప్పిన విషయాలను రాహుల్ గాంధీ సావధానంగా విన్నారు. నోట్ల కష్టాలు తొలగించేందుకు మోదీ సర్కారుపై ఒత్తిడి తీసుకొస్తామని హామీయిచ్చారు. ఇంతకుముందు దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న నోట్ల కష్టాలను రాహుల్ గాంధీ స్వయంగా తెలుసుకున్నారు.