
కరోనా ప్రభావాన్ని నిరోధించేందుకు కేంద్రం ప్రకటించిన ప్యాకేజ్‌ను స్వాగతించిన రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ ప్రతికూల ప్రభావాన్ని నిరోధించేందుకు కేంద్రం ప్రకటించిన రూ 1.7 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్‌ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వాగతించారు. సరైన దిశలో వేసిన తొలి అడుగుగా దీన్ని ఆయన అభివర్ణించారు. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు లాక్‌డౌన్ విధించిన క్రమంలో మన రైతన్నలు, దినసరి కార్మికులు, మహిళలు, వృద్ధులకు అండగా నిలవాల్సిన సమయం ఇదని, ఈ సందర్భంగా కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజ్ సరైన దిశలో తీసుకున్న తొలి చర్య అని రాహుల్ గురువారం ట్వీట్ చేశారు.
కరోనా మహమ్మారిని కట్టడి చేసే క్రమంలో వైరస్ ప్రభావంతో ఆర్థికంగా దెబ్బతినే వర్గాలు, వ్యక్తులకు ఊరటగా కేంద్రం పలు చర్యలు ప్రకటించింది. పేదలకు బియ్యం, గోధుమల పంపిణీతో పాటు ఉచితంగా మూడు నెలల పాటు గ్యాస్ సిలిండర్ల సరఫరా, సంఘటిత రంగంలో రూ 15,000లోపు వేతనం కలిగిన ఉద్యోగుల పీఎఫ్ వాటాను ప్రభుత్వమే చెల్లించడం వంటి చర్యలను ప్యాకేజ్‌లో పొందుపరిచారు. జన్‌థన్ ఖాతాలున్న మహిళలకు మూడు నెలల పాటు నెలకు రూ 500 అందచేయడం, డ్వాక్రా గ్రూపులకు రూ 20 లక్షల రుణ సాయం వంటి పలు ఉపశమన చర్యలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.