సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్రతరమవుతోందని, ఎకానమీపై గతంలో తాను చేసిన హెచ్చరికలను పాలకులు ఎద్దేవా చేశారని సీనియర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.‘ చిన్న మధ్యతరహా సంస్థలు కుప్పకూలుతున్నాయి..భారీ సంస్థలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి..బ్యాంకులూ ఇబ్బందుల్లో కూరుకుపోయా’యని రాహుల్ బుధవారం ట్వీట్ చేశారు. ఆర్థిక సునామీ రాబోతోందని నెలల కిందటే తాను చేసిన హెచ్చరికను బీజేపీ తోసిపుచ్చిందని వ్యాఖ్యానించారు. కార్పొరేట్ రుణాలు రానున్న ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ 1.68 లక్షల కోట్ల మేర పేరుకుపోతాయనే వ్యాసానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను రాహుల్ షేర్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ భారీగా పతనమవుతుందని, ద్రవ్య లోటు బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్న 3.5 శాతం కంటే పెరుగుతుందనే వార్తల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. కోవిడ్-19 కట్టడి సహా పలు అంశాలకు సంబంధించి మోదీ సర్కార్‌పై రాహుల్ ఇటీవల విమర్శల దాడి పెంచారు.
కరోనా వైరస్‌ను దీటుగా ఎదుర్కోవడంలో ప్రభుత్వ అసమర్ధతపై హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (హెచ్‌బీఎస్) అధ్యయనం చేపడుతుందని రాహుల్ చురకలు వేశారు. రాబోయే రోజుల్లో కోవిడ్-19తో పాటు నోట్లరద్దు, జీఎస్టీ అమలు వంటి వైఫల్యాలపై హెచ్‌బీఎస్ కేస్ స్టడీలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. దేశంలోని పలు కొత్త ప్రాంతాలకు కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్నా మహమ్మారిని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళికా లేదని దుయ్యబట్టారు. కోవిడ్-19 వేగంగా విస్తరిస్తున్నా ప్రధాని మౌనముద్ర దాల్చారని మండిపడ్డారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 22,752 తాజా కేసులు బయటపడటంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,42,417కు చేరింది. ఇక మహమ్మారి బారినపడి ఒక్కరోజులోనే 482 మంది ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment