
సాక్షి, న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ వైఖరిని తప్పుపడుతూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. మంగళవారం పార్టీ మహిళా విభాగం నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెడితే తాము పూర్తి మద్దతు ఇస్తామని, లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తామే మహిళా బిల్లును సభలో ఆమోదింపచేస్తామని స్పష్టం చేశారు.
ఆరెస్సెస్ తమ బాధ్యతల్లో మహిళలను ప్రోత్సహించదని, బీజేపీ, ఆరెస్సెస్ భావజాలం కేవలం పురుషులే ఈ దేశాన్ని పాలించాలనేదన్నారు. వీరి హయాంలో మహిళలకు చోటు దక్కినా అవి ప్రాధాన్యత లేనివేనన్నారు. బీజేపీ ఎన్నో విషయాల గురించి చెబుతున్నా మహిళా రిజర్వేషన్ బిల్లు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉందన్నారు. ఈ బిల్లును ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తే తమ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టంగా చెబుతున్నామన్నారు.
బాలికలను వారి బారి నుంచి..
దేశంలో లైంగిక దాడులు జరిగినప్పుడు ప్రధాని మౌనం దాల్చుతారని, యూపీలో బీజేపీ ఎమ్మెల్యే లైంగిక దాడి ఆరోపణల్లో కూరుకుపోతే ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆరోపించారు. గత నాలుగేళ్లుగా ఎన్నడూ లేని విధంగా మహిళలు, బాలికలపై లైంగిక దాడులు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేల నుంచి మన బాలికలను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బేటీ బచావ్ స్కీమ్‌కు జిల్లాకు కేవలం రూ 40 లక్షల నిధులే కేటాయించారన్నారు. కాగా, రాహుల్ ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ లోగోను ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment