Mahila Congress
-
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై స్పీకర్‌కు ఫిర్యాదు
సాక్షి,హైదరాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మహిళా కాంగ్రెస్ నేతలు శుక్రవారం (సెప్టెంబర్13) స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో కౌశిక్‌రెడ్డి ఓటర్లను బెదిరించి గెలిచారని ,గెలిచాక మహిళలను కించపరుస్తూ మాట్లాడినందున కౌశిక్‌రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన వారిలో మహిళా కాంగ్రెస్ నేతలు బండ్రు శోభారాణి, కాల్వ సుజాత తదితరులున్నారు. ఫిర్యాదు అనంతరం వీరు మీడియాతో మాట్లాడుతూ కౌశిక్‌రెడ్డితో బీఆర్ఎస్ అధినేత కేసీఆరే ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నాడా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. అంతకుముందు కౌశిక్‌రెడ్డి మీడియా సమావేశంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ వారికి చీర,గాజులను పంపిస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం పట్ల మహిళా కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ గురువారం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణభవన్‌లో ఆందోళన చేశారు. ఇదీ చదవండి.. మళ్లీ ఉద్రిక్తత.. ఎమ్మెల్యే అరికెపూడి ఇంటి వద్ద బందోబస్తు -
గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత.. మహిళా నేతలను అడ్డుకున్న పోలీసులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ మహిళా కాంగ్రెస్ నేతలు బుధవారం(ఆగస్టు7) ఎరుపు రంగు దుస్తులు వేసుకొని రాష్ట్ర బీజేపీ ఆఫీసు ముందు నిరసనకు బయలుదేరారు. మహిళా నేతలను గాంధీభవన్ గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ఈసందర్భంగా పోలీసులకు మహిళా కాంగ్రెస్ నేతలకు మధ్య తోపులాట జరిగింది. దేశంలో మహిళకు రక్షణ లేదని, నిత్యావసర వస్తువుల పెరుగుదల వల్ల మహిళలపై పడుతున్న భారంపై దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ ఆఫీసులు ముట్టడించాలని జాతీయ మహిళా కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు సిద్ధమయ్యారు. -
మహిళలకు రాందేవ్‌బాబా క్షమాపణలు చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: దేశంలోని మహిళలందరికీ రాందేవ్‌బాబా క్షమాపణలు చెప్పాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.సునీతారావు డిమాండ్ చేశారు. రాందేవ్‌బాబా వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం గాంధీభవన్ ఎదుట మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో మహిళానేతలు రాందేవ్‌బాబా దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేశారు. అనంతరం రాందేవ్‌బాబాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. -
హైదరాబాద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వరలక్ష్మి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎం.వరలక్ష్మి నియమితులయ్యారు. ప్రస్తుతం వరలక్ష్మి తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఇటీవల నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిని క్షమశిక్షణ చర్యల కింద తొలగించడంతో వరలక్ష్మిని నియమిస్తూ ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. (క్లిక్: ముందే చెబితే ‘చెయ్యి’స్తారేమో?) -
హైదరాబాద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కవితా మహేష్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నకరకంటి కవితా మహేష్‌ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు ఆదేశాలు జారీ చేశారు. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ యాక్టింగ్ అధ్యక్షురాలు నెట్ట డిసౌజ ఆమోదం మేరకు నియమిస్తున్నట్లు ప్రకటించారు. నగరంలో మహిళా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ దళితులకు పెద్ద పీట వేస్తుందని మరోసారి రుజువైందన్నారు. తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: ఊహించిందే జరిగింది; ఎన్నిక లేదు.. ఏకగ్రీవమే!) -
బీజేపీ, ఆర్ఎస్ఎస్ నకిలీ హిందువులు
సాక్షి , న్యూఢిల్లీ: హిందూ పారీ్టగా చెప్పుకొనే బీజేపీ, దేశంలో హిందుత్వాన్ని వాడుకుంటుందే తప్ప వారు ఎప్పటికీ హిందువులు కారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్లు తమ ప్రయోజనాల కోసం మతాన్ని ఉపయోగించుకొనే నకిలీ హిందువులు అని ఆయన ఆరోపించారు. అంతేగాక ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు మహిళా శక్తిని అణచివేసి, దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. అయితే కాంగ్రెస్ మాత్రం మహిళా శక్తికి సమాన వేదికను ఇస్తుందని ఆయన తెలిపారు. బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన అఖిల భారత మహిళా కాంగ్రెస్ 38వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న రాహుల్ మహిళా కాంగ్రెస్ నూతన లోగోను ఆవిష్కరించారు. ప్రధాని నరేంద్రమోదీ తన గదిలో కూర్చొని భయంతో వణికిపోతున్నందున సమాజంలోని ప్రతి విభాగంలోనూ భయాన్ని సృష్టించారని అన్నారు. చైనా అంశాన్ని ఉదహరించిన రాహుల్‌గాం«దీ, ఇటీవల చైనా వేల కిలోమీటర్ల భూమిని లాక్కుందని, అయితే నరేంద్ర మోదీ చైనాపై ఉన్న భయంతో అంతా బాగానే ఉందని చెప్పారని ఎద్దేవా చేశారు. ఇది ప్రధాని మోదీ భయానికి సంకేతమని రాహుల్ పేర్కొన్నారు. నరేంద్రమోదీ జీవితమంతా అబద్ధాలపై ఆధారపడి ఉన్నందునే ఆయన భయపడుతున్నారని రాహుల్ విమర్శించారు. ద్వేషంతో కాదు.. ప్రేమతో పోరాడుదాం కాంగ్రెస్ సిద్ధాంతం.. బీజేపీ–ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకమని, రెండు సిద్ధాంతాలలో ఒకటి మాత్రమే దేశాన్ని పాలించగలదని అన్నారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ నాయకులు దేశవ్యాప్తంగా భయాన్ని వ్యాప్తి చేశారని, ప్రస్తుతం రైతులు, మహిళలు భయపడుతున్నారని పేర్కొన్నారు. దేశంలో జీఎస్టీని అమలు చేసినప్పుడే, చిన్న చిన్న దుకాణదారుల ఇంట్లో లక్ష్మీదేవిని బీజేపీ తీసేసిందని ఆయన మోదీ ప్రభుత్వాన్ని నిందించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీఐని అమలు చేయడం ద్వారా దుర్గా శక్తిని కోట్లాది మంది ప్రజల చేతుల్లో అస్త్రంగా ఉంచామని రాహుల్ వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులు తమను తాము హిందూ పార్టీ అని చెప్పుకుంటున్నప్పటికీ, దేశవ్యాప్తంగా లక్షి్మ, దుర్గలపై దాడి చేశారని దుయ్యబట్టారు. హిందూమతం పునాది అహింస. మహాత్మా గాంధీ తన జీవితమంతా హిందూ మతాన్ని అర్థం చేసుకోవడంలో గడిపితే, ఆర్ఎస్ఎస్ భావజాలం ఆ హిందువు ఛాతిపై మూడు బుల్లెట్లను ఎందుకు కాల్చిందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మనం వారిపై ప్రేమతో పోరాడాలి తప్ప ద్వేషంతో పోరాడలేమని కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యానించారు. మోదీ, ఆర్ఎస్ఎస్ దేశానికి ఒక మహిళా ప్రధానిని ఎప్పటికీ ఇవ్వలేవని, కాంగ్రెస్ పార్టీ మహిళను ప్రధానిని చేసి చూపించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఎవరికీ భయపడదని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా, ప్రధాన కార్యదర్శులు సీతక్క, సౌమ్యారెడ్డి, అప్సరా రెడ్డి, తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు, ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రమీలమ్మ సహా తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 200మంది కార్యకర్తలు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచి్చన సుమారు 2వేల మంది కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘అధికారంలోకి వస్తే ట్రిపుల్ తలాక్ రద్దు’
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ట్రిపుల్ తలాక్ బిల్లును రద్దు చేస్తామని ఆ పార్టీ మహిళా విభాగం చీఫ్ సుస్మితా దేవ్ చెప్పారు. ఢిల్లీలో గురువారం కాంగ్రెస్ మైనారిటీ విభాగం సదస్సులో మాట్లాడుతూ ముస్లిం పురుషులపై ముస్లిం మహిళలను ఈ బిల్లు ద్వారా రెచ్చగొట్టే వాతావరణాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సృష్టించారని ఆరోపించారు. ట్రిపుల్ తలాక్ బిల్లు అమలైతే మహిళా సాధికారత సాధ్యమవుతుందని చెబుతున్నా ముస్లిం పురుషులను జైళ్లలో మగ్గేలా, వారిని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పేలా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సంతకాల ఉద్యమం సాగించిన వేలాది ముస్లిం మహిళలను ఆమె అభినందించారు. ఈ బిల్లుకు పార్లమెంట్లో వ్యతిరేకంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని, 2019లో పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని తొలగిస్తుందని సుస్మితా దేవ్ స్పష్టం చేశారు. -
‘నవ్వుతారు ఎక్కడికైనా వెళ్లిపో అన్నారు.. కానీ ఇప్పుడు!’
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ట్రాన్స్‌జెండర్ హక్కుల కార్యకర్త అప్సరా రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆమె కలిశారు. ఈ నేపథ్యంలో.. ‘మహిళా కాంగ్రెస్‌లోకి అప్సరారెడ్డికి స్వాగతం పలుకుతున్నాం. సామాజిక నిబంధనలను అధిగమించి, వాటిని ఆచరణలో పెట్టేందుకు, అవి ఆమోదం పొందేందుకు సుస్మితాదేవ్(కాంగ్రెస్ ఎంపీ) దారులు పరిచారు అంటూ కాంగ్రెస్ మహిళా విభాగం ట్వీట్ చేసింది. తన నియామకం గురించి అప్సరా రెడ్డి మాట్లాడుతూ.. ‘నీ(ట్రాన్స్‌జెండర్) జీవిత కాలంలో ఎటువంటి అద్భుతాలు జరగవనే జరగవు. నిన్ను చూసి నవ్వుతారు. ఎక్కడికైనా దూరంగా వెళ్లిపో అనే మాటలే నేను విన్నాను. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లే నాలాంటి వారికి వెటకారాలు, వెక్కిరింపులు కొత్తేం కాదు. నాకు ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన రాహుల్‌గాంధీకి ధన్యవాదాలు. మహిళలు, పిల్లలు, ట్రాన్స్జెండర్ల తరపున నా గొంతు బలంగా వినిపిస్తాను. భారత్‌లోని అతిపెద్ద, సుదీర్ఘ చరిత్ర గల పార్టీలో నాకు ఈ పదవి దక్కడం... ఉద్వేగానికి గురిచేస్తోంది’ అంటూ హర్షం వ్యక్తం చేశారు. కాగా 134 ఏళ్ల పార్టీ చరిత్రలో ఓ ట్రాన్స్‌జెండర్‌కు ఇటువంటి పదవి దక్కడం ఇదే తొలిసారి. గతంలో జర్నలిస్టుగా పనిచేసిన అప్సరారెడ్డి 2016లో ఏఐఏడీఎంకే(అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం) పార్టీలో చేరారు. ఆ పార్టీ అధినేత్రి జయలలిత మరణం తర్వాత శశికళ అనుకూల వర్గానికి మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. Apsara Reddy has been appointed the first transgender National General Secretary of @MahilaCongress by Congress President @RahulGandhi pic.twitter.com/qDTZSgaoMH — Congress (@INCIndia) January 8, 2019 Welcoming Apsara Reddy to @MahilaCongress As @sushmitadevmp puts it the path for inclusivity comes through acceptance and compassion beyond the set societal norms.#Womenpositive https://t.co/pG3AnmPc6J — All India Mahila Congress (@MahilaCongress) January 8, 2019 -
బీజేపీ ఎమ్మెల్యేల నుంచి వారిని కాపాడుకోవాలి..
సాక్షి, న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ వైఖరిని తప్పుపడుతూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. మంగళవారం పార్టీ మహిళా విభాగం నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెడితే తాము పూర్తి మద్దతు ఇస్తామని, లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తామే మహిళా బిల్లును సభలో ఆమోదింపచేస్తామని స్పష్టం చేశారు. ఆరెస్సెస్ తమ బాధ్యతల్లో మహిళలను ప్రోత్సహించదని, బీజేపీ, ఆరెస్సెస్ భావజాలం కేవలం పురుషులే ఈ దేశాన్ని పాలించాలనేదన్నారు. వీరి హయాంలో మహిళలకు చోటు దక్కినా అవి ప్రాధాన్యత లేనివేనన్నారు. బీజేపీ ఎన్నో విషయాల గురించి చెబుతున్నా మహిళా రిజర్వేషన్ బిల్లు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉందన్నారు. ఈ బిల్లును ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తే తమ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టంగా చెబుతున్నామన్నారు. బాలికలను వారి బారి నుంచి.. దేశంలో లైంగిక దాడులు జరిగినప్పుడు ప్రధాని మౌనం దాల్చుతారని, యూపీలో బీజేపీ ఎమ్మెల్యే లైంగిక దాడి ఆరోపణల్లో కూరుకుపోతే ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆరోపించారు. గత నాలుగేళ్లుగా ఎన్నడూ లేని విధంగా మహిళలు, బాలికలపై లైంగిక దాడులు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేల నుంచి మన బాలికలను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బేటీ బచావ్ స్కీమ్‌కు జిల్లాకు కేవలం రూ 40 లక్షల నిధులే కేటాయించారన్నారు. కాగా, రాహుల్ ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ లోగోను ఆవిష్కరించారు. -
వాస్తుపై ఉన్న శ్రద్ధ మహిళా రక్షణపై ఏది?
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్.. మహిళలను ద్వితీయ శ్రేణి పౌరుల్లా చూస్తున్నారని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఆరోపించింది. యాదాద్రిలో వెలుగుచూసిన వ్యభిచార ఘటనలకు పోలీసులు, శిశుసంక్షేమ శాఖలే బాధ్యత వహించాలని అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీతక్క, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షు రాలు నేరెళ్ల శారద డిమాండ్ చేశారు. శనివారం గాం ధీభవన్‌లో మీడియాతో సీతక్క మాట్లాడుతూ మోదీ, కేసీఆర్‌లు మహిళల భద్రతపై ప్రచార ఆర్భాటం చేస్తూ, రక్షణ మాత్రం గాలికొదిలేశారన్నారు. యాదా ద్రి క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పుకుంటున్న కేసీఆర్‌కు అక్కడ జరిగే పాపాలు పట్టవా అని ప్రశ్నించారు. వాస్తుపై పెట్టే శ్రద్ధ కూడా మహిళల రక్షణపై పెట్టకపోవడం దురదృష్టకరమన్నారు. కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని శారద ఆరోపించారు. రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ నిద్రపోతోందని, పోలీసులు, శిశుసంక్షేమ శాఖల వైఫల్యం కారణంగానే యాదాద్రి వ్యభిచార కూపంగా మారిందన్నారు. వ్యభిచార గృహాల నిర్వాహకులపై నిర్భయ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. -
జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆందోళన
-
జైట్లీ వ్యాఖ్యలపై మండిపాటు
మహిళా కాంగ్రెస్ నిరసన ప్రదర్శన న్యూఢిల్లీ: నగరంలో అత్యాచార ఘటనలపై కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన వ్యాఖ్యలపట్ల మహిళా కాంగ్రెస్ మండిపడింది. తక్షణమే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. జైట్లీ వ్యాఖ్యలకు నిరసనగా అశోకారోడ్డులోని బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకునేందుకు మహిళా కాంగ్రెస్ విభాగం సభ్యులు పెద్దసంఖ్యలో తరలివచ్చిన ప్పటికీ పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకున్నారు. ఈ విషయమై మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శోభా ఓజా మీడియాతో మాట్లాడుతూ ‘తాను త ప్పు చేశాననే విషయాన్ని జైట్లీ నిర్మొహమాటంగా అంగీకరించాలి. మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. కాగా నగరంలో జరిగిన ఓ అత్యాచార ఘటన వల్ల పర్యాటక రంగం దెబ్బతిందంటూ గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశం అనంతరం జైట్లీ వ్యాఖ్యానించిన సంగతి విదితమే. -
బీజేపీ నేత ఇంటిముందు మహిళా కాంగ్రెస్ ఆందోళన
న్యూఢిల్లీ: బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి నివాసం ముందు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ప్రియాంకగాంధీపై నిందలు వేసిన స్వామి, ఆమెకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. తూర్పు ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత వర్యం కౌర్ నేతృత్వంలో మహిళా కార్యకర్తలు స్వామి నివాసం ఎదుట ఆందోళన చేపట్టారు. బీజేపీ నేతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సుబ్రమణియన్ స్వామి మహిళలను గౌరవించడం లేదని, ఆయన ప్రియాంకగాంధీకి క్షమాపణలు చెప్పకపోతే తమ ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందన్నారు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ సవితా శర్మ. మథుర రోడ్డులో కూడా నిరసన చే పట్టాలని ప్రయత్నించడంతో ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఏప్రిల్ 15న కూడా ఆందోళన నిర్వహించిన మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్స్‌ను దాటి స్వామి ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్న విషయం తెలిసిందే.