
కొచ్చిలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ
కేంద్ర సాయం ఏమూలకు..
కొచ్చి : వరదలతో దెబ్బతిన్న కేరళకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాయం ఎంతమాత్రం సరిపోదని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన రాహుల్ కేంద్రం అరకొర సాయం చేస్తూ దక్షిణాది రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు.
కేంద్రం ఆరెస్సెస్ చెప్పుచేతల్లో పనిచేస్తోందని ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం రెండు వైరుధ్య సిద్ధాంతాలున్నాయని, ఒకటి నాగ్‌పూర్ ఆదేశాలతో పనిచేసే కేంద్రీకృత విధానమైతే మరొకరి అన్ని వర్గాల ప్రజలు, సంస్కృతులు, ఆలోచనలను సమాదరిచే విధానం మరొకటని రాహుల్ పేర్కొన్నారు.
భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న బాధితులకు బాసటగా నిలిచేందుకే తాను ఇక్కడికి వచ్చానని, రాజకీయాల కోసం కాదని చెప్పారు. వరదలతో నష్టపోయిన ప్రజలు తమ భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారని, వారికి పాలకులు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా తాను కేరళ సీఎంతో మాట్లాడానని రాహుల్ చెప్పుకొచ్చారు. బాధితులకు ప్రకటించిన పరిహారాన్ని సత్వరమే వారికి అందించాలని కోరారు.