జాతీయ విపత్తుగా ప్రకటించాలి | Uttam Kumar Reddy Demands Central On Kerala Floods | Sakshi
Sakshi News home page

జాతీయ విపత్తుగా ప్రకటించాలి

Published Sun, Aug 19 2018 1:43 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Uttam Kumar Reddy Demands Central On Kerala Floods - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేరళలో ప్రకృతి విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ తరఫున కేరళ వరద బాధితులకు సాయం చేయనున్నట్టు తెలిపారు. రాఫెల్‌ కుంభకోణంపై దేశవ్యాప్త ప్రచా రం, శక్తి యాప్‌ పనితీరు అంశాలపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శనివారం ఢిల్లీలో అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలతో వార్‌రూపంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి రాష్ట్రం నుంచి కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్, ప్రతిపక్ష నేత జానారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ హాజరయ్యారు.

రాఫెల్‌ విమానాల కొనుగోలులో కేంద్రం రూ.41వేలకోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిందని, ఈ ప్రాజెక్టును అనిల్‌ అంబానీ సంస్థకు కట్టబెట్టి అవినీతికి పాల్పడిన తీరుపై దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని నేతలకు రాహుల్‌ ఉద్బోధ చేశారు. ‘‘యూపీఏ హయాంలో ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఒక్కో విమానం రూ.526 కోట్లతో 36 విమానాలను కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ ప్రధాని మోదీ ఫ్రాన్స్‌ వెళ్లి ఒక్కో విమానాన్ని రూ.1,600 కోట్లతో కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకొని రూ.41 వేల కోట్ల భారీ అవినీతికి పాల్పడ్డారు’’అని రాహుల్‌ ఆరోపించారు. ఈ అవినీతిపై దేశవ్యాప్తంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ఎలాంటి కసరత్తు చేయాలన్న దానిపై చర్చించినట్టు మీడియాకు ఉత్తమ్‌ తెలిపారు. 

నెల జీతం విరాళం 
కేరళ వరద బీభత్సంపై సమావేశంలో చర్చించినట్టు ఉత్తమ్‌ తెలిపారు. కాంగ్రెస్‌ తరఫున కేరళకు సాయం అందించాలని నిర్ణయించామన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఒక నెల జీతాన్ని విరాళంగా ఇవ్వాలని రాహుల్‌ ఆదేశించారని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్‌ తరఫునా ప్రత్యేక సాయం చేస్తామని చెప్పారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో శక్తి యాప్‌ పనితీరుపై రాహుల్‌ సమీక్షించినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో శక్తి యాప్‌లో ఇప్పటికే 1.80 లక్షల మంది చేరారని, బూత్‌స్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఇటీవల తెలంగాణలో తన 2 రోజుల పర్యటనపై రాహుల్‌ సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ కుంతియా సమావేశంలో పాల్గొన్నారు. 

సోనియా గాంధీతో ఉత్తమ్‌ భేటీ 
యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీని తన సతీమణి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతితో ఉత్తమ్‌ ఢిల్లీలో ప్రత్యేకంగా కలిశారు. మర్యాదపూర్వకంగానే కలిసినట్లు సమావేశం అనంతరం ఉత్తమ్‌ తెలిపారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి తదితర అంశాలపై చర్చించినట్టు తెలిసింది. 

‘శక్తి’నే మన ఎక్సరే..
క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని స్పష్టంగా తెలుసుకొనేందుకు శక్తి యాప్‌.. ఎక్సరే, సీటీ స్కాన్‌లా పనిచేస్తుందని రాహుల్‌ గాంధీ అన్నారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో శక్తి యాప్‌ పనితీరుపై రాహుల్‌ ఆయా రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు, శక్తియాప్‌ ఇన్‌చార్జులతో సమావేశం నిర్వహించారు. శక్తి యాప్‌ ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ ఎక్కడ బలంగా ఉంది, ఎక్కడ బలహీనంగా ఉందో సులవుగా తెలుసుకోవచ్చని రాహుల్‌ పేర్కొన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 1.80 లక్షల మంది నమోదు చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. శక్తి యాప్‌లో కార్యకర్తల నమోదులో మెరుగైన పనితీరు కనబరిచినందుకు శక్తియాప్‌ తెలంగాణ సమన్వయక్త, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, నూతి శ్రీకాంత్‌ (అంబర్‌పేట్‌), పద్మావతి రెడ్డి (కోదాడ), వంశీకృష్ణ (అచ్చంపేట), దొంతి మాధవరెడ్డి (నర్సంపేట), మఖన్‌ సింగ్‌రాజ్‌ ఠాకూర్‌ (రామగుండం), సంజీవ్‌రెడ్డి (సంగారెడ్డి), వి.ప్రతాప్‌రెడ్డి (గజ్వేల్‌), జి.ప్రసాద్‌కుమార్‌ (వికారాబాద్‌), అనిల్‌ (బాల్కొండ), మహేశ్వర్‌రెడ్డి (నిర్మల్‌)లను రాహుల్‌ సన్మానించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement