అఫిడవిట్లో భార్య పేరు ప్రస్తావించరు
మోడీపై రాహుల్ గాంధీ విమర్శలు
దోడా: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తాను వివాహితుడినంటూ మొదటిసారిగా తన భార్య పేరును వెల్లడించడంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు సంధించారు. ‘‘బీజేపీ మహిళల భద్రత గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి ఇప్పటికి ఎన్నో ఎన్నికల్లో పాల్గొన్నారు.
కానీ, తాను వివాహితుడినని మొదటిసారిగా వెల్లడించారు. ఢిల్లీలో ఆయన మహిళల గౌరవం గురించి మాట్లాడతారు. కానీ, ఆయన భార్య పేరు అఫిడవిట్లో ఉండదు’’ అంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. శుక్రవారం జమ్మూకాశ్మీర్లోని దోడాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడారు. గుజరాత్‌లో ఒక మహిళపై పోలీసు నిఘా అంశాన్ని ప్రస్తావిస్తూ, బీజేపీ అసలు రూపం ఇదేనని, మహిళల సాధికారతపై ఆ పార్టీ చెప్పేదేంటని ప్రశ్నించారు.
అద్వానీ స్థానంలో అదానీ వచ్చారు..
గుజరాత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో ఆ రాష్ట్ర సీఎం మోడీకి ఉన్న సంబంధాలపై రాహుల్ ప్రశ్నలు సంధించారు. అదానీకి అన్నీ ఇచ్చారని, అదే సమయంలో బీజేపీ అగ్ర నేతలైన అద్వానీ, జశ్వంత్‌సింగ్‌ను పక్కకు నెట్టేశారని రాహుల్ విమర్శించారు. గుజరాత్‌లో అదానీ ప్రభుత్వం నడుస్తోందంటూ దెప్పిపొడిచారు.
ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు: తన వైవాహిక స్థితి విషయమై తప్పుడు అఫిడవిట్ ఇచ్చినందుకు మోడీపై ఎన్నికల కమిషన్ క్రిమినల్ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ డిమాండ్ చేశారు. మోడీపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ నేతృత్వంలో ఆ పార్టీ ప్రతినిధి బృందం ఢిల్లీలో ఎన్నికల కమిషన్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. మోడీపై కాంగ్రెస్ చేసిన విమర్శలను బీజేపీ ఖండించింది. తన వివాహ విషయంలో మోడీ అబద్ధాలాడలేదని, అలాంటప్పుడు దీనిని ఒక అంశంగా చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించింది.
మహిళలపై గౌరవం ఇదేనా?
Published Sat, Apr 12 2014 1:42 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement