
రాహుల్.. మళ్లీ ఫారిన్ టూర్!
తాను మళ్లీ విదేశాలకు వెళ్తున్నట్లు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. 46వ పుట్టిన రోజు జరిగిన ఒక్కరోజు తర్వాత.. ఆయనీ విషయం వెల్లడించారు గానీ, ఎక్కడకు వెళ్తున్నదీ చెప్పలేదు. స్పల్పకాలిక పర్యటన కోసం దేశం వదిలి వెళ్తున్నానని, తనకు ఆదివారం నాడు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినవారు అందరికీ మరోసారి కృతజ్ఞతలని రాహుల్ ట్వీట్ చేశారు. మీ అందరి అభిమానానికి కృతజ్ఞడినన్నారు. ఆదివారం పుట్టినరోజు సందర్భంగా రాహుల్ గాంధీని పార్టీ ప్రధాన కార్యాలయంలో వందలాది మంది కార్యకర్తలు కలిశారు.
ఇంతకుముందు రాహుల్ గాంధీ 2015 ఫిబ్రవరిలో ఎవరికీ చెప్పకుండా వేరే దేశం వెళ్లిపోయి, 60 రోజుల తర్వాత తిరిగి వచ్చారు. అప్పట్లో ఆయన బ్యాంకాక్ వెళ్లారంటూ కథనాలు వచ్చాయి. అసలు ఎందుకు వెళ్లారన్న విషయమై పలు అనుమానాలు చెలరేగాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎలా పారిపోతారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. మళ్లీ గత సంవత్సరం డిసెంబర్ నెలాఖరులో కొత్త సంవత్సరం వేడుకల కోసం మరోసారి వెళ్లారు. అయితే వేరే దేశం వెళ్తున్నట్లుగా ఆయన ట్విట్టర్‌లో చెప్పడం మాత్రం ఇదే మొదటిసారి.
Traveling out of the country for a few days on a short visit.Thanks again to all who met &wished me y'day,truly grateful for your affection!
— Office of RG (@OfficeOfRG) 20 June 2016