నేటి నుంచి రద్దు చార్జీలు డబుల్ | Railway refund rules to change from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రద్దు చార్జీలు డబుల్

Nov 12 2015 8:35 PM | Updated on May 24 2018 1:29 PM

టికెట్ రద్దు చేసుకొనే ప్రయాణికులపై రైల్వేశాఖ భారాన్ని పెంచింది.

సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: టికెట్ రద్దు చేసుకొనే ప్రయాణికులపై రైల్వేశాఖ భారాన్ని పెంచింది. ఇప్పటి వరకు ఉన్న చార్జీలను రెట్టింపు చేసింది. పెంచిన టికెట్ రద్దు(రీఫండింగ్)చార్జీలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు, ఆర్‌ఏసీ ప్రయాణికులు ఇప్పటి వరకు బుకింగ్ కౌంటర్‌లలో టికెట్ రద్దు కోసం చెల్లిస్తున్న రూ.30ల రుసుము ఇక నుంచి  రూ.60కి పెరగనుంది.

అలాగే వివిధ తరగతుల కోసం బుక్ చేసుకున్న నిర్ధారిత(కన్ఫర్మ్‌డ్) టికెట్ రీఫండింగ్ చార్జీలు కూడా  రెట్టింపు కానున్నాయి. ప్రస్తుతం నిర్ధారిత టికెట్‌లపైన ట్రైన్ బయలుదేరడానికి 6 గంటల ముందు, బయలుదేరిన తరువాత 2 గంటలలోపు టికెట్ రద్దు చేసుకొంటే 50 శాతం డబ్బులు తిరిగి చెల్లించే సదుపాయం ఉండేది.
 
 ఇక నుంచి బండి బయలుదేరడానికి  12 గంటల నుంచి  4 గంటల ముందు టికెట్‌లు రద్దు చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే ఈ  50 శాతం సొమ్ము తిరిగి చెల్లిస్తారు. అంటే ట్రైన్ బయలుదేరిన తరువాత కూడా టికెట్ రద్దు చేసుకొనే సదుపాయం ఇక ఉండబోదు. రైలు బయలుదేరడానికి 4 గంటలు ముందే టికెట్‌లు రద్దు చేసుకోవాలన్న నిబంధన వల్ల మిగిలిన బెర్తులను వెయిటింగ్ లిస్టు ప్రయాణికులకు కేటాయించేందుకు అవకాశం ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు.
 
48 గంటల ముందు రద్దు చేసుకునేవారికి రీఫండింగ్ చార్జీల్లో మార్పులు ఇలా ఉంటాయి. ఇప్పటి వరకు నిర్ధారిత ఫస్ట్ ఏసీ టికెట్ రీఫండింగ్ చార్జీ రూ.120 ఉండగా, ఇక నుంచి  రూ.240కి పెరగనుంది. సెకెండ్ ఏసీ చార్జీ.. రూ.100 నుంచి రూ.200లకు, థర్డ్‌ఏసీ చార్జీ.. రూ.90 నుంచి రూ.180 కి పెరుగుతుంది. హా స్లీపర్ క్లాస్.. రూ.60 నుంచి రూ.120కి, సెకెండ్ క్లాస్.. రూ.30 నుంచి రూ.60 కి పెరుగుతాయి.
 
ఒకే టికెట్‌పైన ఎక్కువ మంది ప్రయాణికులు బుక్ చేసుకున్నప్పుడు కొందరికి బెర్తులు లభించి, మరి కొందరు వెయిటింగ్ లిస్టులో ఉండే పాక్షిక నిర్ధారిత టికెట్‌లను రద్దు చేసుకొనేందుకు ప్రస్తుతం ట్రైన్ బయలుదేరిన తరువాత 2 గంటల వరకు గడువు ఉండేది. ఇక నుంచి ట్రైన్ బయలుదేరిన 30 నిమిషాల్లోపు మాత్రమే పాక్షిక నిర్ధారిత టికెట్‌లు రద్దు చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది.

ఈ-టిక్కెట్‌ల రద్దు కోసం ఇప్పటి వరకు ట్రావెల్ డిపాజిట్ రిసీట్(టీడీఆర్)లను అందజేయవలసి ఉండేది. ఇక నుంచి టీడీఆర్ అవసరం లేకుండా.. ఆటోమేటిక్‌గా రద్దవుతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement