ఎక్కడెక్కడ వర్షాలు ఎలా కురుస్తున్నాయి?
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది అధికంగా వర్షాలు కురుస్తున్నాయన్న ఆనందం అన్ని ప్రాంతాల వారికి దక్కడం లేదు. అస్సాం, బీహార్, గుజరాత్, మహారాష్ట్రాల్లో వర్షాల వల్ల వరదలు కూడా సంభవిస్తున్నాయని వింటున్నాం. కానీ ఆ రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాలకే వర్షాలు పరిమితమవుతున్నాయి. దేశంలో రుతుపవనాలు ఆదిలో మంద గమనంతో కదిలినప్పటికీ ఇప్పుడు దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని, ఇప్పటికీ సాధారణ వర్షపాతంలో 9 శాతమే లోటని భారత వాతావరణ శాఖ తెలిపింది.
2015 సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది కాస్త బెటరే. కాని దేశంలోని అన్ని ప్రాంతాలకు ఆగస్టు నెల వచ్చినప్పటికీ ఇంకా వర్షాలు విస్తరించడం లేదు. గతేడాది వర్షాకాల సీజన్ ముగిసే సెప్టెంబర్ నెల నాటికి సాధారణ వర్షపాతంకన్నా 14 శాతం వర్షాలు తక్కువగా కురిశాయి. ఎల్‌నినో ప్రభావం వల్ల ఈసారి సాధారణ వర్షం కన్నా ఎక్కువ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసింది. వర్షాలను సూచించే మ్యాప్‌ను పరిశీలించినట్లయితే సంక్లిష్ట పరిస్థితే కనిపిస్తోంది.
గుజరాత్‌నే ఉదాహరణగా తీసుకుంటే దక్షిణ గుజరాత్‌లో సోమవారం కురిసిన భారీ వర్షాలకు వరదలు వచ్చి ఐదుగురు మరణించారు. అయినప్పటికీ ఆ రాష్ట్రంలో ఇప్పటికీ లోటు వర్షపాతమే నమోదైంది. కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో చిన్నపాటి చినుకులు తప్ప పెద్ద వర్షాలే పడలేదు. ఆగస్టు మూడవ తేదీ నాటికి కచ్ ప్రాంతంలో సాధారణ వర్షపాతంకన్నా 72 శాతం లోటు వర్షాలు కురిశాయి. సురేంద్రనగర్, ఆనంద్ ప్రాంతాల్లో 60 శాతం తక్కువ వర్షపాతం నమోదయింది. ఈసారి గుజరాత్‌లో వ్యవసాయం సాగు కూడా తగ్గిపోయింది.
ఉత్తర యూపీలో, హిమాచల్ ప్రదేశ్‌లోని స్పిటి ప్రాంతంలో సాధారణ వర్షపాతంలో 15 శాతం మాత్రమే ఇంతవరకు వర్షాలు కురిశాయి. కిన్నార్ ప్రాంతంలో 37 శాతం వర్షాలు కురిశాయి. వర్షాధార వ్యవసాయంపై ఎక్కువ ఆధారపడే హిమాచల్ ప్రాంతాల్లో వర్షాలు సరిగ్గా కురవడం లేదు. పంజాబ్‌లోని సగం ప్రాంతాల్లో ఇప్పటికీ తక్కువ వర్షపాతమే నమోదయింది. ఫిరోజ్‌పూర్ ప్రాంతంలో 77 శాతం తక్కువ వర్షపాతం నమోదయింది. కపూర్తలా ప్రాంతంలో మాత్రం సాధారణంకన్నా 47 శాతం వర్షాలు కురిశాయి.
మేఘాలయాలో కూడా తక్కువ వర్షాలే నమోదయ్యాయి. దక్షిణ గరో హిల్స్‌లో దేశంలోకెల్లా అతి తక్కువ వర్షపాతం నమోదయింది. అక్కడ 89 శాతం తక్కువ వర్షపాతం కురిసింది. మిజోరమ్, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో ఎంత వర్షపాతం నమోదయిందో తెలియడం లేదు. ఆ మూడు రాష్ట్రాల్లో వర్షాలను నమోదుచేసే ప్రాంతాలు తక్కువగా ఉండడం, ఆయా రాష్ట్రాల అధికారుల వద్ద మ్యాప్‌లు లేకపోవడం వల్ల పరిస్థితి అంచనాలకు అందడం లేదు. దేశంలో ప్రతి ఏటా ఎక్కువ వర్షాలు కురిసినా, తక్కువ వర్షాలు కురిసినా కొన్ని ప్రాంతాల్లో వరదలు రావడం, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేక జల వనరులు మృగ్యమవడం సాధారణమే. కానీ ఎంతకాలం ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయి. ఎక్కువ, త క్కువ వర్షాల నమోదును విశ్లేషించడం ద్వారా ప్రత్యామ్నాయ చర్యలను తీసుకోవాల్సిన బాధ్యత అటు కేంద్రపైనా, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది.