తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
విశాఖపట్నం :
వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రుతుపవనాలు తెలంగాణలో చురుగ్గా, కోస్తా, రాయలసీమల్లో ఒక మోస్తరుగా కదులుతున్నాయి. శుక్రవారం తెలంగాణలో అనేకచోట్ల, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. కోస్తాలో తీరం వెంబడి గంటకు 45 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా, తెలంగాణలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా, తెలంగాణాల్లో ఉరుములతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ఉపరితల ప్రభావంతో రానున్న 3రోజుల్లో బంగాళాఖాతలంలో అల్పపీడనం ఏర్పడనున్నది. ఇది బలపడే క్రమంలో రుతుపవనాలు చురుగ్గా మారనున్నాయి. దీంతో కోస్తా, తెలంగాణాల్లో ఈనెల 17,18 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.