mansoons
-
మరో నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు..
సాక్షి, చెన్నై(తమిళనాడు): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి అండమాన్ సముద్రం మధ్యలో కేంద్రీకృతమై ఉంది, ఈ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో మరో 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధనాకేంద్రం ఆదివారం ప్రకటించింది. వచ్చే 48 గంటల్లో చెన్నై నగరం మేఘావృతమై ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. కన్యాకుమారిపై తీవ్ర ప్రభావం.. గత 11 రోజులుగా భారీ వర్షాలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా కన్యాకుమారి జిల్లా భారీ నష్టాన్ని చవిచూసింది. 50 వేల ఇళ్లు నీటమునిగాయి. ఇంకా భారీ వర్షాలు పడే ప్రమాదం ఉన్నందున కన్యాకుమారి జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. సేలం జిల్లాల్లోని మేట్టూరు డ్యామ్ నిండు కుండలా మారింది. కావేరి నది నీటి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా శనివారం రాత్రి 11.35 గంటలకు మేట్టూరు డ్యాం పూర్తి నీటి సామర్థ్యం (120 అడుగులు)కి చేరింది. ప్రజా పనుల శాఖ అధికారులు ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు 93.47 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సెకనుకు 25,150 ఘనపుటడుగుల నీరు చేరుతోంది. సెకనుకు 25,150 ఘనపుటడుగుల నీటిని విడుదల చేస్తుండగా, 286 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. కావేరినదీ పరివాహక ప్రాంతాల్లో.. కావేరి నది తీర ప్రాంతంలోని 12 జిల్లాలకు వరద ప్రమాదం ఉండటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు. చెన్నైలో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులు 90 శాతం పూర్తయినట్లు చెన్నై కార్పొరేషన్ అధికారులు తెలిపారు. 22 సబ్వేలలో ట్రాఫిక్‌ను పునరుద్ధరించామని చెప్పారు. అయితే వాస్తవానికి చెన్నైలోని 70 వీధుల్లో వరదనీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఆదివారం రాత్రి లోగా వాటిని తొలగిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. పీఎం సహాయాన్ని కోరుతా : సీఎం స్టాలిన్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టం అంచనా నివేదిక అందిన తరువాత ప్రధాని నరేంద్రమోదీకి లేఖరాసి సహాయాన్ని కోరనున్నట్లు సీఎం స్టాలిన్ తెలిపారు. పార్లమెంట్ సభ్యులను స్వయంగా పంపి వరద సహాయక చర్యల నిమిత్తం నిధులను కోరుతామని చెప్పారు. వరద సహాయక చర్యలను సమీక్షించేందుకు సీఎం స్టాలిన్ చెన్నై సచివాలయంలో ఉన్నతాధికారులతో ఆదివారం సమావేశమై పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. -
మూడు రోజులు కోస్తాకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఒడిశా తీరంలో ఉపరితల ఆవర్తనం, దానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని దీనికితోడు కోస్తాపై నైరుతి రుతుపవనాల ప్రభావం చురుగ్గా కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో రేపటి నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు విస్తారంగా కురుస్తాయి.రాయలసీమలో రానున్న మూడు రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నాయి. రేపటి నుంచి మూడు రోజుల పాటు కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్ష సూచన. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిమీ వేగంతో, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గంటకు 40 –50 కిమీ వేగంతో గాలులు వీస్తాయని ప్రకటన. మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరిక. గడిచిన 24 గంటల్లో కర్నూలులో 3 సెంమీ, సి.బెలగొళ, బద్వేల్, మంత్రా లయం, పలమనేరులో 2 సెంమీ వర్షపాతం నమోదైంది. -
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
-
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
-
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో నగరంలో బుధవారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. హైదరాబాద్‌లో పలుచోట్ల కురిసిన భారీ వర్షానికి ట్రాఫిక్ జామ్ అయింది. పలు చోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించడంతో వాహన చోదకులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. (రెండ్రోజుల్లో ‘నైరుతి’!) రాజేంద్రనగర్, అత్తాపూర్, నార్సింగి, గండిపేట, మణికొండ, పాతబస్తీ లాలదర్వాజ, చార్మినార్, చాంద్రాయణగుట్ట, ఉప్పుగూడా, ఛత్రినాక, అలియబాద్, ముషీరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్, నారాయణగూడ, ఖైరతాబాద్, నాంపల్లి, కోటి, ట్యాంక్ బండ్ గోషామహల్, ఖైతరాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎర్రగడ్డ, కూకట్పల్లి, బంజారాహిల్స్‌లో వర్షం పడింది. కాగా రానున్న 24 గంటల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు రాయలసీమ, కోస్తా ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశముంది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ ఈదురుగాలులతో వర్షాలు పడ్డాయి. -
నవ్వులు నాటిన ‘నైరుతి’!..
సాక్షి, హైదరాబాద్: ‘నైరుతి’వెళ్లిపోయింది.. బుధవారం నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా నిష్క్రమించాయి.. ఇటు ఈశాన్య రుతుపవనాలు మొదలయ్యాయి. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో చివరి రెండు నెలలు నైరుతి రుతుపవనాలతో వర్షాలు కుమ్మేశాయి. ఈ సీజన్లో తెలంగాణలో సాధారణంగా 759.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 805.6 మిల్లీమీటర్లు నమోదైంది. సాధారణం కంటే 6 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. సాధారణానికి అటుఇటుగా వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేయగా, అంతకుమించి వర్షం కురవడం గమనార్హం. 2016 తర్వాత ఈసారి తెలంగాణలో 6 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. 2016లో 19 శాతం అధికంగా వర్షం కురిసింది. అంతకుముందు 2013లో 26 శాతం, 2010లో 32 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం లెక్కలు చెబుతున్నాయి. జూన్‌లో లోటు.. సెప్టెంబర్‌లో అధికం గత పదేళ్లలో ఈ సీజన్‌తో కలిపి ఐదు సార్లు అధిక వర్షాలు నమోదు కాగా, మిగిలిన ఐదు సార్లు లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌లో తెలంగాణలో 33 శాతం లోటు వర్షపాతం నమోదైతే, జూలైలో 12 శాతం లోటు రికార్డయింది. ఇక ఆగస్టులో వర్షాలు ఊపందుకున్నాయి. ఆ నెలలో 11% అధిక వర్ష పాతం నమోదు కాగా, సెప్టెంబర్‌లో రికార్డు స్థాయిలో ఏకంగా 83 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇక రాష్ట్రంలో మొత్తం 589 మండలాలుంటే, ఈ సీజన్లో ఇప్పటివరకు 359 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 122 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే కొమురంభీం, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్‌నగర్, ములుగు, నారాయణపేట జిల్లాలో అధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షం కురిసింది. దేశంలో కూడా రికార్డు దేశవ్యాప్తంగా కూడా ఈ సీజన్లో అధిక వర్షపాతం నమోదైంది. మొత్తంగా 10 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ వందేళ్ల రికార్డు దేశంలో ఒకటి నమోదైంది. సరిగ్గా వందేళ్ల కిత్రం అంటే 1917 సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా 165 శాతం వర్షపాతం నమోదైతే, మళ్లీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో 152 శాతం వర్షపాతం నమోదైంది. వందేళ్ల తర్వాత ఆ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం గమనార్హం. గణనీయంగా ఖరీఫ్ సాగు.. నైరుతి రుతుపవనాలు తెచ్చిన భారీ వర్షాలతో ఈ ఏడాది ఖరీఫ్‌లో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా నమోదైంది. ఖరీఫ్‌లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా... ఇప్పటివరకు ఏకంగా 1.10 కోట్ల ఎకరాల్లో (102 శాతం) పంటలు సాగయ్యాయి. అందులో వరి సాధారణ సాగు విస్తీర్ణం 24.11 లక్షల ఎకరాలు కాగా, రికార్డు స్థాయిలో 31.47 లక్షల ఎకరాల్లో (131 శాతం) నాట్లు పడ్డాయి. ఇక పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 43.12 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు ఏకంగా 46.48 లక్షల ఎకరాల్లో (108 శాతం) సాగైంది. పప్పు ధాన్యాల సాగు సాధారణ విస్తీర్ణం 10.37 లక్షల ఎకరాలు కాగా... 9.42 లక్షల (91 శాతం) ఎకరాల్లో సాగైంది. రాష్ట్రంలో అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 128 శాతం, నారాయణపేట జిల్లాలో 122 శాతం పంటల సాగు నమోదైంది. అతి తక్కువగా జనగామ 83 శాతం, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో 86 శాతం పంటలు సాగయ్యాయి. ఇక రబీ సాగుకు కూడా ఈ వర్షాలు దోహదం చేశాయి. జలాశయాలు, చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లడంతో రబీలో అంచనాలకు మించి పంటల సాగు నమోదవుతుందని వ్యవసాయశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రవేశం.. ఈశాన్య రుతుపవనాలు బుధవారం రాష్ట్రంలోకి ప్రవేశించాయి. తమిళనాడు దాన్ని ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ తమిళనాడు తీరానికి దగ్గరలో ఉన్న నైరుతి బంగాళాఖాతం నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో గురువారం అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఒకట్రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. ఇక గత 24 గంటల్లో మహబూబాబాద్‌లో 5 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో గత పదేళ్లలో నమోదైన వర్షపాతం –––––––––––––––––––––––––––––––––––––––––––––– ఏడాది సాధారణంతో పోలిస్తే నమోదైన వర్షపాతం (శాతంలో) –––––––––––––––––––––––––––––––––––––––––––––– 2009 –35 2010 32 2011 –13 2012 4 2013 26 2014 –34 2015 –21 2016 19 2017 –13 2018 –2 2019 6 -
నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు
తర్వాతి మూడు రోజులు మోస్తరు వర్షాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి ఖానాపూర్‌లో 4 సెంటీమీటర్ల వర్షం సాక్షి, హైదరాబాద్: అల్పపీడనం కారణంగా రుతుపవనాలు ఊపందుకోవడంతో శనివారం రాష్ట్రంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత మూడు రోజులు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక గత 24 గంటల్లో ఖానాపూర్‌లో 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చింతకాని, మహబూబాబాద్, గూడూరు, కొత్తగూడెం, బయ్యారం, నర్సంపేటల్లో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. దుమ్ముగూడెం, గార్ల, ఏన్కూరు, మధిర, పేరూరు, తల్లాడ, డోర్నకల్, ములుగు, నల్లబెల్లి, బోనకల్, పాల్వంచ, జగిత్యాలల్లో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. ప్రస్తుతం వానలు పడుతున్నా ఇప్పటికీ రాష్ట్రంలో 17 శాతం లోటు వర్షపాతం నమోదైంది. వర్షంతో నిలిచిన కాళేశ్వరం పనులు కాళేశ్వరం (మంథని): జయ శంకర్ భూపాలపల్లి జిల్లా లోని కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు వర్షం ఆటంకం కలిగిం చింది. దీంతో మేడి గడ్డ బ్యారేజీ, మేడి గడ్డ పంప్‌హౌస్, అన్నారం బ్యారేజీ పనులు నిలిచాయి. ప్రాజెక్టు, పంప్‌హౌస్ లోని మట్టి బురదగా మారడంతో పనులను ఆయా కంపెనీలు తాత్కా లికంగా ఆపేశాయి. మరో వైపు జిల్లాలోని ఏజెన్సీ ప్రాం తంలో ఉదయం నుంచి సాయం త్రం వరకు కురిసిన వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండ లాల్లో 90 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో కన్నాయిగూడెం పరిధిలోని ఏటూరులో కంతనపల్లి వాగు ఉప్పొంగింది. కంతనపల్లి వద్ద లోలెవల్ కాజ్వే వద్ద వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సుమారు 15 గ్రామాల ప్రజలు రాక పోకలకు ఇబ్బందులు పడ్డారు. నిండుకుండ.. కిన్నెరసాని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని ప్రధాన జలాశయాలు కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా ప్రస్తుతం 406 అడుగులకు చేరుకుంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 73.30 మీటర్లకు చేరుకుంది. జలాశయంలోకి ప్రస్తుతం 2,600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఆరు గేట్లను ఎత్తి 8,170 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. వర్షపునీరు గోదావరిలోకి చేరుతుండటంతో భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. మరోవైపు ఖమ్మం జిల్లాలో కురిసిన జోరువాన ధాటికి వైరా రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కొణిజర్ల మండలం తీగల బంజర వద్ద పగిడేరు, అంజనాపురం వద్ద నిమ్మవాగు పొంగిపొర్లుతున్నాయి. -
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
విశాఖపట్నం : వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రుతుపవనాలు తెలంగాణలో చురుగ్గా, కోస్తా, రాయలసీమల్లో ఒక మోస్తరుగా కదులుతున్నాయి. శుక్రవారం తెలంగాణలో అనేకచోట్ల, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. కోస్తాలో తీరం వెంబడి గంటకు 45 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా, తెలంగాణలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా, తెలంగాణాల్లో ఉరుములతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ఉపరితల ప్రభావంతో రానున్న 3రోజుల్లో బంగాళాఖాతలంలో అల్పపీడనం ఏర్పడనున్నది. ఇది బలపడే క్రమంలో రుతుపవనాలు చురుగ్గా మారనున్నాయి. దీంతో కోస్తా, తెలంగాణాల్లో ఈనెల 17,18 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. -
రాజధానిలో భారీ వర్షం
సిటీబ్యూరో: రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై మోకాళ్లలోతు వరదనీరు పోటెత్తడంతో ట్రాఫిక్ ఎక్కడకిక్కడే స్తంభించింది. కార్యాలయాలు, విద్యాసంస్థల నుంచి ఇంటికి బయలుదేరిన వారు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకున్నారు. కొన్ని చోట్ల సుమారు సెంటీమీటరు మేర వర్షపాతం నమోదైనట్లువవాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా మాదాపూర్, గచ్చిబౌలి, హిమాయత్ నగర్, నారాయణ గూడ, ఖైరతాబాద్, సంతోష్‌నగర్, అబిడ్స్, కోఠి, దిల్సుఖ్ నగర్, మలక్‌పేట, ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్, కాప్రా, కుషాయిగూడ, సైనిక పురి, వనస్థలిపురం, పెద్ద అంబర్ పేట, బీఎన్ రెడ్డి నగర్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులపై వరద నీరు పొంగి ప్రవహించింది. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు రెండుగంటలపాటు అంతరాయం ఏర్పడింది. నాగార్జున సర్కిల్, పంజాగుట్ట, గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్ ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అధికమైంది. సరోజిని దేవీ ఆసుపత్రి, మాసబ్ ట్యాంక్, మహావీర్ ఆసుపత్రి, లక్డీకాపూల్ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. -
ఎక్కడెక్కడ వర్షాలు ఎలా కురుస్తున్నాయి?
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది అధికంగా వర్షాలు కురుస్తున్నాయన్న ఆనందం అన్ని ప్రాంతాల వారికి దక్కడం లేదు. అస్సాం, బీహార్, గుజరాత్, మహారాష్ట్రాల్లో వర్షాల వల్ల వరదలు కూడా సంభవిస్తున్నాయని వింటున్నాం. కానీ ఆ రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాలకే వర్షాలు పరిమితమవుతున్నాయి. దేశంలో రుతుపవనాలు ఆదిలో మంద గమనంతో కదిలినప్పటికీ ఇప్పుడు దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని, ఇప్పటికీ సాధారణ వర్షపాతంలో 9 శాతమే లోటని భారత వాతావరణ శాఖ తెలిపింది. 2015 సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది కాస్త బెటరే. కాని దేశంలోని అన్ని ప్రాంతాలకు ఆగస్టు నెల వచ్చినప్పటికీ ఇంకా వర్షాలు విస్తరించడం లేదు. గతేడాది వర్షాకాల సీజన్ ముగిసే సెప్టెంబర్ నెల నాటికి సాధారణ వర్షపాతంకన్నా 14 శాతం వర్షాలు తక్కువగా కురిశాయి. ఎల్‌నినో ప్రభావం వల్ల ఈసారి సాధారణ వర్షం కన్నా ఎక్కువ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసింది. వర్షాలను సూచించే మ్యాప్‌ను పరిశీలించినట్లయితే సంక్లిష్ట పరిస్థితే కనిపిస్తోంది. గుజరాత్‌నే ఉదాహరణగా తీసుకుంటే దక్షిణ గుజరాత్లో సోమవారం కురిసిన భారీ వర్షాలకు వరదలు వచ్చి ఐదుగురు మరణించారు. అయినప్పటికీ ఆ రాష్ట్రంలో ఇప్పటికీ లోటు వర్షపాతమే నమోదైంది. కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో చిన్నపాటి చినుకులు తప్ప పెద్ద వర్షాలే పడలేదు. ఆగస్టు మూడవ తేదీ నాటికి కచ్ ప్రాంతంలో సాధారణ వర్షపాతంకన్నా 72 శాతం లోటు వర్షాలు కురిశాయి. సురేంద్రనగర్, ఆనంద్ ప్రాంతాల్లో 60 శాతం తక్కువ వర్షపాతం నమోదయింది. ఈసారి గుజరాత్లో వ్యవసాయం సాగు కూడా తగ్గిపోయింది. ఉత్తర యూపీలో, హిమాచల్ ప్రదేశ్‌లోని స్పిటి ప్రాంతంలో సాధారణ వర్షపాతంలో 15 శాతం మాత్రమే ఇంతవరకు వర్షాలు కురిశాయి. కిన్నార్ ప్రాంతంలో 37 శాతం వర్షాలు కురిశాయి. వర్షాధార వ్యవసాయంపై ఎక్కువ ఆధారపడే హిమాచల్ ప్రాంతాల్లో వర్షాలు సరిగ్గా కురవడం లేదు. పంజాబ్‌లోని సగం ప్రాంతాల్లో ఇప్పటికీ తక్కువ వర్షపాతమే నమోదయింది. ఫిరోజ్‌పూర్ ప్రాంతంలో 77 శాతం తక్కువ వర్షపాతం నమోదయింది. కపూర్తలా ప్రాంతంలో మాత్రం సాధారణంకన్నా 47 శాతం వర్షాలు కురిశాయి. మేఘాలయాలో కూడా తక్కువ వర్షాలే నమోదయ్యాయి. దక్షిణ గరో హిల్స్‌లో దేశంలోకెల్లా అతి తక్కువ వర్షపాతం నమోదయింది. అక్కడ 89 శాతం తక్కువ వర్షపాతం కురిసింది. మిజోరమ్, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో ఎంత వర్షపాతం నమోదయిందో తెలియడం లేదు. ఆ మూడు రాష్ట్రాల్లో వర్షాలను నమోదుచేసే ప్రాంతాలు తక్కువగా ఉండడం, ఆయా రాష్ట్రాల అధికారుల వద్ద మ్యాప్‌లు లేకపోవడం వల్ల పరిస్థితి అంచనాలకు అందడం లేదు. దేశంలో ప్రతి ఏటా ఎక్కువ వర్షాలు కురిసినా, తక్కువ వర్షాలు కురిసినా కొన్ని ప్రాంతాల్లో వరదలు రావడం, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేక జల వనరులు మృగ్యమవడం సాధారణమే. కానీ ఎంతకాలం ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయి. ఎక్కువ, త క్కువ వర్షాల నమోదును విశ్లేషించడం ద్వారా ప్రత్యామ్నాయ చర్యలను తీసుకోవాల్సిన బాధ్యత అటు కేంద్రపైనా, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. -
ఉత్తర తెలంగాణలో చురుగ్గా రుతుపవనాలు
విశాఖపట్నం : ఉత్తర తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదలుతున్నాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం మంగళవారం వెల్లడించింది. రాగల 24 గంటల్లో తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది. మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుందని పేర్కొంది. అలాగే అల్పపీడన ప్రాంతంలోఉపరితల ఆవర్తనం ఏర్పడిందని చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం, బుధవారం ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని తెలిపింది. కోస్తాతీరం వెంబడి 45 -50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఈ నేపథ్యంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. -
చురుగ్గా నైరుతి.. 7న కేరళకు..
రాష్ట్రంలో మరో ఐదు రోజులు వర్షాలు సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. ఉపరితల ఆవర్తనం కారణంగా కేరళను నైరుతి రుతుపవనాలు ఏడో తేదీన తాకే అవకాశముందన్నారు. తర్వాత ఏపీలోకి, అనంతరం తెలంగాణలోకి ప్రవేశిస్తాయన్నారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వైపు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో మరో ఐదు రోజులపాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడతాయని, రాష్ట్రంలో వడగాడ్పుల హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉండకపోవచ్చన్నారు. ఇక గత 24 గంటల్లో గద్వాల్లో 3, మెదక్, టేకులపల్లిలో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. గురువారం రామగుండంలో అత్యధికంగా 45, ఆదిలాబాద్‌లో 44, హైదరాబాద్‌లో 34.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు రాష్ట్రంలో 20 మంది వడదెబ్బతో మృత్యువాత పడ్డారు.