శుక్రవారం భూపాలపల్లి జిల్లా ఏటూరులో ఉధృతంగా ప్రవహిస్తున్న కంతనపల్లి వాగు
తర్వాతి మూడు రోజులు మోస్తరు వర్షాలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
ఖానాపూర్‌లో 4 సెంటీమీటర్ల వర్షం
సాక్షి, హైదరాబాద్:
అల్పపీడనం కారణంగా రుతుపవనాలు ఊపందుకోవడంతో శనివారం రాష్ట్రంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత మూడు రోజులు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక గత 24 గంటల్లో ఖానాపూర్‌లో 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చింతకాని, మహబూబాబాద్, గూడూరు, కొత్తగూడెం, బయ్యారం, నర్సంపేటల్లో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. దుమ్ముగూడెం, గార్ల, ఏన్కూరు, మధిర, పేరూరు, తల్లాడ, డోర్నకల్, ములుగు, నల్లబెల్లి, బోనకల్, పాల్వంచ, జగిత్యాలల్లో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. ప్రస్తుతం వానలు పడుతున్నా ఇప్పటికీ రాష్ట్రంలో 17 శాతం లోటు వర్షపాతం నమోదైంది.
వర్షంతో నిలిచిన కాళేశ్వరం పనులు
కాళేశ్వరం (మంథని): జయ శంకర్ భూపాలపల్లి జిల్లా లోని కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు వర్షం ఆటంకం కలిగిం చింది. దీంతో మేడి గడ్డ బ్యారేజీ, మేడి గడ్డ పంప్‌హౌస్, అన్నారం బ్యారేజీ పనులు నిలిచాయి. ప్రాజెక్టు, పంప్‌హౌస్ లోని మట్టి బురదగా మారడంతో పనులను ఆయా కంపెనీలు తాత్కా లికంగా ఆపేశాయి. మరో వైపు జిల్లాలోని ఏజెన్సీ ప్రాం తంలో ఉదయం నుంచి సాయం త్రం వరకు కురిసిన వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండ లాల్లో 90 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో కన్నాయిగూడెం పరిధిలోని ఏటూరులో కంతనపల్లి వాగు ఉప్పొంగింది. కంతనపల్లి వద్ద లోలెవల్ కాజ్‌వే వద్ద వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సుమారు 15 గ్రామాల ప్రజలు రాక పోకలకు ఇబ్బందులు పడ్డారు.
నిండుకుండ.. కిన్నెరసాని
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని ప్రధాన జలాశయాలు కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా ప్రస్తుతం 406 అడుగులకు చేరుకుంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 73.30 మీటర్లకు చేరుకుంది. జలాశయంలోకి ప్రస్తుతం 2,600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఆరు గేట్లను ఎత్తి 8,170 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. వర్షపునీరు గోదావరిలోకి చేరుతుండటంతో భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. మరోవైపు ఖమ్మం జిల్లాలో కురిసిన జోరువాన ధాటికి వైరా రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కొణిజర్ల మండలం తీగల బంజర వద్ద పగిడేరు, అంజనాపురం వద్ద నిమ్మవాగు పొంగిపొర్లుతున్నాయి.