మరో నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. | Heavy Rainfall In Tamilnadu | Sakshi
Sakshi News home page

Tamilnadu: మరో నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు..

Published Mon, Nov 15 2021 7:46 AM | Last Updated on Mon, Nov 15 2021 7:46 AM

Heavy Rainfall In Tamilnadu - Sakshi

సాక్షి, చెన్నై(తమిళనాడు): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి అండమాన్‌ సముద్రం మధ్యలో కేంద్రీకృతమై ఉంది, ఈ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో మరో 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధనాకేంద్రం ఆదివారం ప్రకటించింది. వచ్చే 48 గంటల్లో చెన్నై నగరం మేఘావృతమై ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వానలు పడే అవకాశం ఉంది.  

కన్యాకుమారిపై తీవ్ర ప్రభావం.. 
గత 11 రోజులుగా భారీ వర్షాలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా కన్యాకుమారి జిల్లా భారీ నష్టాన్ని చవిచూసింది. 50 వేల ఇళ్లు నీటమునిగాయి. ఇంకా భారీ వర్షాలు పడే ప్రమాదం ఉన్నందున కన్యాకుమారి జిల్లాకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. సేలం జిల్లాల్లోని మేట్టూరు డ్యామ్‌ నిండు కుండలా మారింది. కావేరి నది నీటి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా శనివారం రాత్రి 11.35 గంటలకు మేట్టూరు డ్యాం పూర్తి నీటి సామర్థ్యం (120 అడుగులు)కి చేరింది.

ప్రజా పనుల శాఖ అధికారులు ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు 93.47 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సెకనుకు 25,150 ఘనపుటడుగుల నీరు చేరుతోంది. సెకనుకు 25,150 ఘనపుటడుగుల నీటిని విడుదల చేస్తుండగా, 286 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు.  

కావేరినదీ పరివాహక ప్రాంతాల్లో.. 
కావేరి నది తీర ప్రాంతంలోని 12 జిల్లాలకు వరద ప్రమాదం ఉండటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు. చెన్నైలో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులు 90 శాతం పూర్తయినట్లు చెన్నై కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. 22 సబ్‌వేలలో ట్రాఫిక్‌ను పునరుద్ధరించామని చెప్పారు. అయితే వాస్తవానికి చెన్నైలోని 70 వీధుల్లో వరదనీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఆదివారం రాత్రి లోగా వాటిని తొలగిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. 

పీఎం సహాయాన్ని కోరుతా : సీఎం స్టాలిన్‌ 
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టం అంచనా నివేదిక అందిన తరువాత ప్రధాని నరేంద్రమోదీకి లేఖరాసి సహాయాన్ని కోరనున్నట్లు సీఎం స్టాలిన్‌ తెలిపారు. పార్లమెంట్‌ సభ్యులను స్వయంగా పంపి వరద సహాయక చర్యల నిమిత్తం నిధులను కోరుతామని చెప్పారు. వరద సహాయక చర్యలను సమీక్షించేందుకు సీఎం స్టాలిన్‌ చెన్నై సచివాలయంలో ఉన్నతాధికారులతో ఆదివారం సమావేశమై పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement