రాజధానిలో భారీ వర్షం
సిటీబ్యూరో:
రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై మోకాళ్లలోతు వరదనీరు పోటెత్తడంతో ట్రాఫిక్ ఎక్కడకిక్కడే స్తంభించింది. కార్యాలయాలు, విద్యాసంస్థల నుంచి ఇంటికి బయలుదేరిన వారు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకున్నారు.
కొన్ని చోట్ల సుమారు సెంటీమీటరు మేర వర్షపాతం నమోదైనట్లువవాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా మాదాపూర్, గచ్చిబౌలి, హిమాయత్ నగర్, నారాయణ గూడ, ఖైరతాబాద్, సంతోష్‌నగర్, అబిడ్స్, కోఠి, దిల్‌సుఖ్ నగర్, మలక్‌పేట, ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్, కాప్రా, కుషాయిగూడ, సైనిక పురి, వనస్థలిపురం, పెద్ద అంబర్ పేట, బీఎన్ రెడ్డి నగర్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులపై వరద నీరు పొంగి ప్రవహించింది. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు రెండుగంటలపాటు అంతరాయం ఏర్పడింది. నాగార్జున సర్కిల్, పంజాగుట్ట, గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్ ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అధికమైంది. సరోజిని దేవీ ఆసుపత్రి, మాసబ్ ట్యాంక్, మహావీర్ ఆసుపత్రి, లక్డీకాపూల్ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.