ఫిరాయింపులను ప్రోత్సహించడం అనైతికం
► సైద్ధాంతిక కారణాలైతే పార్టీకి, పదవులకు రాజీనామా చేయాలి
► అసెంబ్లీ స్థానాల పెంపునకు పార్లమెంట్ ఆమోదం ఉండాల్సిందే
► ‘సాక్షి’తో సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో అధికారపార్టీలు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించడం అనైతికమని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా అన్నారు. ఢిల్లీలో సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఒక పార్టీ ఎన్నికల గుర్తుపై గెలిచిన ప్రజాప్రతినిధులు వేరే పార్టీలోకి ఫిరాయించడాన్ని ప్రస్తావిస్తూ.. సైద్ధాంతిక అంశాలపై పార్టీ మారితే అర్థం చేసుకోవచ్చని, అయితే ఫిరాయింపుదారులు తప్పనిసరిగా పార్టీకి, పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేయాల్సిందేనని పేర్కొన్నారు.అలా చేయలేదంటే స్వార్థ ప్రయోజనాల కోసమే వారు పార్టీ ఫిరాయించినట్లు స్పష్టమవుతుందన్నారు. ఏపీ, తెలంగాణలో మాత్రమే కాదని.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫిరాయింపుల వ్యతిరేక చట్టంలో లొసుగులను వాడుకొని రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని మరింత పటిష్టం చేయాలని అవసరముందన్నారు. దీనిపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26లో చిన్న సవరణ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుపై స్పష్టత లేదన్నారు. పార్లమెంట్ ఆమోదంతోనే అసెంబ్లీ స్థానాల పెంపు సాధ్యమన్నారు. అందుకు అవసరమైన బిల్లును పార్లమెం ట్‌లో ప్రవేశపెట్టిన తర్వాతే ఈ విషయంపై స్పష్టత వస్తుందని రాజా చెప్పారు.