రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. మోదీతో పాటు
న్యూఢిల్లీ : రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. మోదీతో పాటు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో ఆమె సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడంలో భాగంగా వసుంధర రాజే ఈరోజు ఉదయం ఢిల్లీ చేరుకున్నారు.
లలిత్ మోదీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వసుంధర రాజేకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీలోని ప్రజాకర్షక నేతలను కాంగ్రెస్ టార్గెట్ చేస్తోందని..రాజేకు మద్దతుగా పలువురు బీజేపీ నేతలు నిలిచారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తొలుత ప్రధాని మోదీతోనూ, అనంతరం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతోనూ భేటీ అయ్యాక సీఎం పదవికి వసుంధర రాజే రాజీనామా చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరితో వసుంధర రాజే భేటి ప్రాధాన్యతను సంతరించుకుంది.