జైపూర్ : భూపరిహారం విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాజస్థాన్ రైతులు వినూత్న నిరసన చేపట్టారు. భూములు కోల్పోతున్న రైతులు తమంతట తామే నడుము లోతు గోతులు తవ్వుకుని, వాటిలో నిలబడి నిరసనను తెలియజేస్తున్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్ శివారు నిందార్ గ్రామంలో గాంధీ జయంతి(అక్టోబర్ 2)న ప్రారంభమైన ‘జమీన్ సమాధి సత్యాగ్రహ్’ నిరసనలో వందలమంది రైతులు భాగస్వాములయ్యారు.
ఏమిటి వివాదం? : జైపూర్ శివారులో హౌసింగ్ ప్రాజెక్టు చేపట్టాలనుకున్న ప్రభుత్వం.. ‘జైపూర్ డెవలప్‌మెంట్ అథారిటీ’ని ఏర్పాటుచేసి, దాని ద్వారా 800 ఎకరాల భూమిని సేకరించబోతున్నట్లు 2010లో ప్రకటించింది. కానీ, గడిచిన ఏడేళ్లలో కేవలం 10 ఎకరాలను మాత్రమే సేకరించగలిగింది. దానిపైనా కోర్టులో పలు వివాదాలు నడిచాయి. కోర్టు ఆదేశాల మేరకు ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిందార్ గ్రామస్తుల పేరు మీద రూ.60 కోట్లను డెవలప్‌మెంట్ అథారిటీ డిపాజిట్ చేసింది. కానీ నేటి వరకు రైతులెవ్వరూ ఆ డబ్బును తీసుకోలేదు.
ఏడేండ్ల కిందట ప్రకటించిన పరిహారాన్ని తాము అంగీకరించబోమని నిందార్ గ్రామస్తులు వాదిస్తున్నారు. ఇప్పటి ధరల ప్రకారం రీసర్వే చేయించాలని డిమాండ్ చేస్తూ గడిచిన రెండు నెలలుగా ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వాధికారులు ఎంతకీ స్పందించకపోవడంతో గాంధీ జయంతిన ‘జమీన్ సమాధి సత్యాగ్రహ్’ పేరుతో వినూత్న నిరసనకు దిగారు. పదుల సంఖ్యలో రైతులు నడుము లోతు గొయ్యిల్లో నిలబడి తమ నిరసనను తెలియజేస్తున్నారు. వారికి సంఘీభావంగా మహిళలు సైతం భారీ కందకాలలో కూర్చొని దీక్ష చేస్తున్నారు. సమాధి సత్యాగ్రహ దీక్ష ప్రారంభమై నాలుగు రోజులు గడుస్తున్నా, ప్రభుత్వం వైపు నుంచి స్పందన రాకపోవడంతో రైతులు మండిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment