
పులికోసం ’ది గ్రేట్ ఆపరేషన్’
రణతంబోర్: బావిలో పడిన ఓ ఆడపులిని రక్షించేందుకు అటవీ శాఖ అధికారులు గొప్ప ఆపరేషన్ నిర్వహించారు. అక్కడి గ్రామస్తుల సహాయంతో పులిని ప్రాణాలతో రక్షించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రణతంబోర్ నేషనల్ పార్క్ కు చెందిన టీ-83 (మెరుపు) అనే ఆడపులి ఖావా అనే గ్రామంలో ఉన్న ఒక బావిలో పడింది. ఈ విషయాన్ని గ్రామస్తులు అధికారులకు చెప్పడంతో వెంటనే రంగంలోకి రాజస్థాన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు దిగారు. ఎంతో క్లిష్టంగా దానిని వెలికి తీసే ఆపరేషన్ నిర్వహించారు. ఇందుకోసం వారు తాడు, వల, ఇనుప బోను, ఒక ఇనుప బొంగుల మంచాన్ని సిద్ధం చేసుకున్నారు.
తొలుత ఇనుప బోనులోకి ఓ అధికారిని ఉంచి దానిని బావిలోకి దించగా అతను పులికి మత్తు మందు ఇచ్చాడు. ఆ వెంటనే మంచానికి నాలుగువైపులా తాడును కట్టి లోపలికి దించారు. దీంతో అతడు ఆ మంచంపై కూర్చుని పులిని వలలో బందించి మంచంపైకి ఎక్కించి బయటకు తీసుకొచ్చాడు. అనంతరం పార్క్ లోకి వదిలేశారు. ఈ ఆపరేషన్ నిర్వహించే సమయంలో పలువురు గ్రామస్తులు, పర్యాటకులు తమ కెమెరాలతో చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేశారు.