Ranthambore National Park
-
Suraj Bhai Meena: అడవిలో ఆడపులి.. పల్లె కట్టుబాటును దాటి...
Suraj Bhai Meena- దాదాపు 1300 చదరపు కిలోమీటర్లు ఉండే రణథమ్‌బోర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో చాలా ఆడపులులు ఉన్నాయి. వాటిని చూపి ఉపాధి పొందే మగ టూరిస్ట్లూ ఉన్నారు. కాని వారందరి మధ్య ఇంకో ఆడపులి కూడా ఉంది. సూరజ్‌బాయి మీనా. ఆ అడవి దాపున పల్లెలో పుట్టి పెరిగిన మీనా మొదటిసారి ఆ ప్రాంతంలో మహిళా టూరిస్ట్‌గైడ్‌గా మారింది. మగవాళ్లు వద్దన్నారు. ఊరు వద్దంది. కాని ఇప్పుడు ఆమెకు వస్తున్న పేరు చూసి ఊరే మారింది. ఆడపిల్లలను ఆమెలా మారమని చెబుతోంది. రాజస్థాన్‌లోని సవాయి మధోపూర్ టౌన్ చుట్టుపక్కల బనస్ నదిని చుట్టుముడుతూ ఉండే అతి పెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ రణథమ్‌బోర్ 1980 ల నుంచి టూరిజంలో చురుగ్గా ఉంది. అప్పటి నుంచి ఎందరో గైడ్లు ప్రపంచ వ్యాప్తంగా వచ్చే టూరిస్ట్‌లను అడవిలో గైడ్ చేస్తూ ఉంటారు. వారికి పులిని చూపుతూ ఉంటారు. ధైర్యంగా తిరుగుతూ ఉంటారు. అదంతా పురుషుల పనే 2007 వరకూ. కాని ఆ సంవత్సరం మొదటిసారి ఒక మహిళా గైడ్ అడవిలోకి వచ్చింది. సూరజ్‌బాయి మీనా. ఆ అమ్మాయిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒకరోజు రెండురోజులు ఉండి పారిపోతుంది అనుకున్నారు. కాని ఇవాళ్టి వరకూ సూరజ్‌బాయి మీనా అక్కడ పని చేస్తూనే ఉంది. తనలాంటి మరో నలుగురు మహిళా గైడ్లను తయారు చేసి వారికీ ఉపాధి చూపింది. పల్లె కట్టుబాటును దాటి... సూరజ్‌బాయి మీనాది రణథమ్‌బోర్ రిజర్వ్‌కు ఆనుకుని ఉన్న భురి పహడి అనే కుగ్రామం. ఏడుగురు అన్నదమ్ముల్లో మీనా ఒక్కతే ఆడపిల్ల. ఆ ఊళ్లో ఎవరికీ చదువు లేదు. ఆడపిల్లలకు అసలే లేదు. ఇంకా చెప్పాలంటే ఆడపిల్ల చదువుకుంటే ఎక్కువ కట్నం ఇవ్వాలి. ఆ చుట్టుపక్కల చెప్పే చదువులో 8వ తరగతి తర్వాతే ఏబిసిడిలు నేర్పిస్తారు. అలాంటి చోటు నుంచి బయలుదేరింది మీనా. ‘మా అన్నయ్య హేమరాజ్ మొదట రిజర్వ్ ఫారెస్ట్‌లో చేరాడు. నేను అప్పుడప్పుడు వాడితో కలిసి అడవిలోకి వచ్చేదాన్ని. అడవి నాకు చాలా నచ్చేది. నేను కూడా అన్నయ్యలాగే గైడ్ అవ్వాలనుకున్నాను. కాని అది అంత సులభం కాదని నాకు తెలుసు’ అంది మీనా. తల్లిదండ్రులను ఒప్పించి టెన్త్ చదివిన మీనా ఒకటి రెండేళ్ల తర్వాత గైడ్‌గా మారడానికి నిశ్చయించుకుంది. కాని ఈ విషయం ఊళ్లో ఎవరికీ నచ్చలేదు. వచ్చి అందరూ ఆమె తల్లిదండ్రులను తిట్టారు. ‘ఆ ఫారిన్ వాళ్లు వచ్చి నిన్నేమైనా చేస్తే? వాళ్ల మధ్యన పడి నువ్వు మా పరువు తీస్తే’ అని తల్లి ఆందోళన చెందింది. మీనా అన్నయ్యల్లో హేమరాజ్ తప్ప మిగిలిన వారు కూడా మద్దతు ఇవ్వలేదు. కాని హేమరాజ్ ఆమెకు అండగా నిలిచాడు. చెల్లెలు ఉద్యోగస్తురాలవ్వాలని ఒప్పించాడు. సవాయి మధోపూర్‌కు తీసుకెళ్లి ఫారెస్ట్ వాళ్ల ట్రైనింగ్‌కు అప్లికేషన్ పెట్టించాడు. చెల్లెలు అక్కడ ట్రైనింగ్ తీసుకునేందుకు ఏర్పాటు చేశాడు. అక్టోబర్ 2007లో మీనా తొలి మహిళా గైడ్‌గా అడవిలో ప్రవేశించింది. పులినీ... విమర్శనూ ఇప్పుడు మీనాకు రెండు సవాళ్లు ఎదురయ్యాయి. ఒకటి ఫారెస్ట్‌లో పని చేస్తున్న పురుష గైడ్ల సమ్మతి పొందడం. రెండు టూరిస్ట్‌లతో ఇంగ్లిష్ మాట్లాడటం. మీనా పనికి వచ్చిన కొత్తల్లో పురుష గైడ్లు ‘నీకిక్కడ ఏం పని?’ అన్నట్టుగా చూసేవారు. ఆమె కూడా యూనిఫామ్ వేసుకుని సఫారీలో టూరిస్ట్‌లను ఎక్కించుకుని అడవి చూపించడానికి బయలుదేరితే కోపంగా చూసేవారు. ఇంకోవైపు ఫారిన్ టూరిస్ట్‌లకు అడవిలో చెట్ల పేర్లు, పక్షుల పేర్లు, జంతువుల పేర్లు ఇంగ్లిష్‌లో చెప్పాల్సి వచ్చేది. అన్న సాయంతో మీనా ఆ పేర్లన్నీ హిందీ లిపీలో రాసుకుని ఇంగ్లిష్‌ని సాధన చేసి నేర్చుకుంది. చిన్న పెద్ద వాక్యాలు పలకడం తెలుసుకుంది. ఖాళీగా ఉన్నప్పుడు అడవంతా తిరుగుతూ పక్షుల్ని గుర్తించేది. ఆమెకు సరదాగా మాట్లాడటం వచ్చు. టూరిస్ట్‌లను నవ్వించేది. క్రమంగా ఆమె అందరికీ నచ్చింది. పులితో భేటి రణథమ్‌బోర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఇప్పుడు 80 పులులు ఉన్నాయి. అన్నింటికీ పేర్లు ఉన్నాయి. అన్ని పులులనూ మీనా గుర్తించగలదు. ‘పులి కనిపిస్తే టూరిస్ట్‌లకు దాని పేరు చెప్తాను. అన్ని పులులు ఒక్కలాగే ఉంటాయి. దాని పేరే అదేనని నీకెలా తెలుసు అని చాలామంది టూరిస్ట్‌లు అడుగుతారు. ఏం చెప్పమంటారు’ అంటుంది. ఫారెస్ట్‌కు వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్లు, బర్డ్ వాచర్స్, ప్రకృతి ప్రేమికులు చాలామంది వస్తుంటారు. మీనా అడవి చూపిస్తుంటుంది. ‘ఒక ఫోటోగ్రాఫర్ పులిని ఫోటో తీస్తూ జిప్సీ నుంచి కింద పడ్డాడు. నేను వెంటనే జిప్సీ దిగి అతనికి, పులికీ మధ్య నిలబడ్డాను. లక్కీగా అది ఏమీ చేయకుండా వెళ్లిపోయింది’ అంది మీనా. కొన్నిసార్లు పులి జిప్సీ బానెట్ మీదకు లంఘిస్తూ ఉంటుంది. కాని ఎప్పుడూ ఎలాంటి అపాయం జరగలేదు. ‘పులి కనిపించకపోతే టూరిస్ట్‌లు విసుక్కుంటారు. పులిని చూపించు అంటారు. అది నేను రమ్మంటే రాదు కదా. అంతగా కచ్చితంగా చూడాలంటే జూకు వెళ్లండి అని చెప్తుంటాను’ అని నవ్వుతుంది మీనా. జీవితం పులిలా వెంటబడితే మనిషికి పులి కంటే ఎక్కువ ధైర్యం వస్తుంది. తన జీవితాన్ని మలుచుకోవడానికి మీనా సివంగిలా మారింది. ఇద్దరు పిల్లలు, భర్తతో ఆమె సంతోషంగా ఉంది. అన్నట్టు బి.ఇడి వరకూ చదివేసింది కూడా. కలవాలంటే ఈ వేసవిలో రణథమ్‌బోర్ ట్రిప్ వేయండి. -
అటు కాదురా బాబూ.. ఇటూ..
పొలోమని వెళ్లిందేమో.. బెంగాల్ టైగర్‌ను చూడటానికి.. కనిపిస్తే.. వెంటనే కెమెరాతో క్లిక్మనిపించేయడానికి.. ఇక్కడ చూడండి.. పులి వచ్చి ఎదురుగా నిల్చుంటే.. వీళ్లంతా ఎటు చూస్తున్నారో.. రాజస్తాన్‌లోని రణతంబోర్ జాతీయ పార్కులో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ‘పార్కుకు వచ్చిన జనమంతా ఏదో పొదల వెనుక పులి ఉన్నట్లు అనిపిస్తే.. అటు చూస్తూ ఉండిపోయారు.. ఇటేమో.. ఈ పులి అకస్మాత్తుగా వాహనం ముందుకు వచ్చింది. చివరికి అది కూడా ఆశ్చర్యపోయినట్లుంది.. అందుకే నేనిక్కడ ఉంటే.. వీళ్లంతా ఎటు చూస్తున్నారబ్బా అంటూ.. వెనక్కి ఓసారి లుక్కిచ్చుకుని ముందుకు సాగింది’ అని ఈ చిత్రాన్ని తీసిన వన్యప్రాణి ఫొటోగ్రాఫర్ అర్పిత్ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ మధ్య మెక్సికోలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.. తిమింగలాలను చూడ్డానికి బయల్దేరిన కొందరు.. మనోళ్లలాగే.. ఎటో దిక్కులు చూస్తూ ఉండిపోయారు.. ఆ తర్వాత ఏం జరిగింది అంటే.. ఫొటో చూడండి.. మీకు అర్థమవుతుంది.. -
కూతురు కూతురే.. పేకాట పేకాటే..
ఇక్కడ రెండు పులులు భీకరంగా కొట్టేసుకుంటున్నాయి గానీ.. నిజానికివి తల్లీకూతుళ్లు.. మొన్న మొన్నటి వరకూ కలిసి ఉన్నవే.. కానీ ఇప్పుడు కూతురు తన జాగాలో అడుగుపెడితే చాలు... వాళ్లమ్మ కస్సుమంటోంది. ఇదిగో ఇలా పైన పడి కొట్టిసింది కూడా.. అడవుల్లోని పులులు తమ ప్రాంతంలోకి వేరే పులులు వస్తే చాలు.. ఇలాగే రియాక్ట్ అవుతాయి. ఎవరి రాజ్యం వాళ్లదన్నమాట.. సాధారణంగా పిల్లలను ఏమీ అనవని.. అయితే.. ఇక్కడ పులుల సంఖ్య పెరిగిందని.. దానివల్ల స్థలం కరువై చివరికి తల్లీకూతుళ్లు కూడా ఇలా చీటికిమాటికీ గొడవపడే స్థాయికి పరిస్థితి చేరిందని అటవీ రేంజర్లు చెబుతున్నారు. ఈ చిత్రాలను రణతంబోర్ జాతీయ పార్కులో పుణెకు చెందిన ఫోటోగ్రాఫర్ చంద్రబాల్ సింగ్ క్లిక్ మనిపించారు. -
వైరలవుతోన్న ప్రియాంక కుమారుడి పోస్ట్
ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల చాలెంజ్‌లు వైరలవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో సవాలు తెర మీదకు వచ్చింది. అయితే ఈ సారి చాలెంజ్‌కి ఓ ప్రత్యేకత ఉంది. ఏంటంటే.. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ కుమారుడి షేర్ చేసిన ఫోటోకు సంబంధించిన చాలెంజ్ ఇది. దాంతో ఇది ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తోంది. వివరాలు.. ప్రియాంక గాంధీ కుమారుడు రియ్హాన్ రాజీవ్ వాద్రా ప్రస్తుతం రణతంబోర్ నేషనల్ పార్కులో వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్‌గా బిజీ బిజీగా గడుపుతున్నారు. పార్కు అందాలను, వన్య ప్రాణులను తన కెమరాలో బంధించి అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం రియ్హాన్ ట్వీట్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆకుపచ్చ ఆకుల మధ్య ఓ పులి కన్ను కనిపిస్తోంది. ప్రకృతి వర్ణాల మధ్య పులి కన్ను కూడా ఆ రంగులోనే కనిపిస్తుంది. (చదవండి: వైరల్ అవుతున్నపెళ్లి ప్రకటన) Eye Spy T-101, Zone - 6, Ranthambore National Park, 06/10/20. pic.twitter.com/nQ5g2RV9Wp — Raihan Rajiv Vadra (@raihanrvadra) October 7, 2020 దాంతో నెటిజనులు ఇందులో పులి కన్నుని కనుక్కొండి అంటూ ఈ ఫోటోని రీట్వీట్, షేర్ చేస్తున్నారు. అంతేకాక అద్భుతమైన ఫోటోలు తీశారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా రియ్హాన్ వన్యప్రాణులు.. ముఖ్యంగా పులులకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ.. అభిమానులను ఆకట్టుకుంటున్నారు. -
ఆడపులి కోసం భీకర పోరు
మాములుగా ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకోవడం చూసుంటాం. కానీ రెండు మగ పులులు(అందులో అవి సోదరులు).. ఒక ఆడ పులి కోసం భీకర పోరుకు దిగిడం ఎప్పుడైనా చూశారా?. ఇలాంటి ఘటనే రాజస్తాన్‌లోని రణతంబోర్ జాతీయ పార్క్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రణతంబోర్ షర్మిలి అనే అడపులికి సింగ్‌స్థ్(టీ57), రాకీ (టీ58) అనే రెండు మగ పులులు జన్మించాయి. అయితే ఇటీవల ఈ రెండు క్రూరంగా ఒకదానిపై ఒకటి దాడికి పాల్పడ్డాయి. వాటి మధ్య గొడవ ప్రారంభం అవగానే ఓ ఆడపులి అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయింది. అయితే ఈ రెండు పులులు మాత్రం ఒకదానిపై మరోకటి తీవ్రంగా దాడి చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కస్వాన్ బుధవారం తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్త వైరల్‌గా మారడంతో.. ఈ యుద్ధంలో ఎవరు గెలిచారని చెప్పాలంటూ ప్రవీణ్‌ను కోరారు. దీనిపై స్పందించిన ప్రవీణ్.. ‘ఈ యుద్ధంలో టీ57 గెలిచింది. ఈ యుద్ధంలో రెండింటికి కూడా ప్రమాదకర గాయాలు కాలేదు. అవి రెండు నూర్(టీ39) అనే ఆడపులి కోసం గొడవకు దిగాయి. రెండు మగ పులలు మధ్య గొడవ ప్రారంభం అక్కడి నుంచి వెళ్లిపోయిన ఆడపులే నూర్’ అని తెలిపారు. -
ఆడపులి కోసం మగ పులుల భీకర పోరు
-
పులిని నిద్రలేపినందుకు రూ.51000 జరిమానా!
జైపూర్: జూపార్క్‌కు వెళ్లినప్పుడు ఎన్‌క్లోజర్‌లోని జంతువులను చూడడంతో పిల్లలు ఊరుకోరు. వాటిని ఆట పట్టించేందుకు చిన్న చిన్న కర్రలు, రాళ్లతో కొడుతుంటారు. ఇలా చేయడం జంతువులకు ఇబ్బందికరంగా ఉంటుందనే విషయం బహుశా పిల్లలకు తెలియకపోవచ్చు. కానీ పెద్దవాళ్లు కూడా ఇదే పనిచేస్తే తప్పు కదా! స్వేచ్ఛగా జీవించే హక్కు మనుషులకే కాదు.. జంతువులకు కూడా ఉంది. ఆ స్వేచ్ఛకు భంగం కలిగిస్తే వాటి హక్కును కాలరాసినట్టే. ఇప్పుడిదంతా ఎందుకంటే.. రాజస్థాన్‌లో ఓ టైగర్ రిజర్వ్ పార్క్‌లో నిద్రపోతున్న పులిని రాళ్లతో కొట్టి నిద్రలేపే ప్రయత్నం చేసినందుకు ఒక పర్యాటకుడికి, అతడి గైడ్‌కు 51,000 రూపాయల జరిమానా విధించారు. వివరాల్లోకెళ్తే.. జైపూర్ సమీపంలోని రాంతాంబోర్ టైగర్ రిజర్వ్(ఆర్టీఆర్)కు గైడ్‌తోపాటు ఓ పర్యాటకుడు వచ్చాడు. పార్క్‌లోని జోన్–6లో ఉన్న పిలిఘాట్ గేట్ నుంచి వీరు జిప్సీ వాహనంలో పార్క్‌లోకి ప్రవేశించారు. పార్క్ గురించి గైడ్ చెప్పే విషయాలు వింటూ తన కెమెరాలో పార్క్‌లోని ప్రదేశాలను జంతువులను ఫొటోలు తీస్తున్నాడు పర్యాటకుడు. ఇంతలో వాళ్లకు నిద్రపోతున్న ఓ పులి కనిపించింది. అయితే ఆ పులిని నిద్రలేపాలని అనుకున్నారు. వెంటనే కొన్ని రాళ్లు తీసుకొని పులి మీద విసిరారు. అయితే స్థానిక పులుల సంరక్షణాధికారి ఈ విషయాన్ని గమనించి పర్యాటకుడికి, గైడ్‌కు కలిపి 51,000 రూపాయల జరిమానా విధించారు. -
పులికోసం ’ది గ్రేట్ ఆపరేషన్’
-
పులికోసం ’ది గ్రేట్ ఆపరేషన్’
రణతంబోర్: బావిలో పడిన ఓ ఆడపులిని రక్షించేందుకు అటవీ శాఖ అధికారులు గొప్ప ఆపరేషన్ నిర్వహించారు. అక్కడి గ్రామస్తుల సహాయంతో పులిని ప్రాణాలతో రక్షించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రణతంబోర్ నేషనల్ పార్క్ కు చెందిన టీ-83 (మెరుపు) అనే ఆడపులి ఖావా అనే గ్రామంలో ఉన్న ఒక బావిలో పడింది. ఈ విషయాన్ని గ్రామస్తులు అధికారులకు చెప్పడంతో వెంటనే రంగంలోకి రాజస్థాన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు దిగారు. ఎంతో క్లిష్టంగా దానిని వెలికి తీసే ఆపరేషన్ నిర్వహించారు. ఇందుకోసం వారు తాడు, వల, ఇనుప బోను, ఒక ఇనుప బొంగుల మంచాన్ని సిద్ధం చేసుకున్నారు. తొలుత ఇనుప బోనులోకి ఓ అధికారిని ఉంచి దానిని బావిలోకి దించగా అతను పులికి మత్తు మందు ఇచ్చాడు. ఆ వెంటనే మంచానికి నాలుగువైపులా తాడును కట్టి లోపలికి దించారు. దీంతో అతడు ఆ మంచంపై కూర్చుని పులిని వలలో బందించి మంచంపైకి ఎక్కించి బయటకు తీసుకొచ్చాడు. అనంతరం పార్క్ లోకి వదిలేశారు. ఈ ఆపరేషన్ నిర్వహించే సమయంలో పలువురు గ్రామస్తులు, పర్యాటకులు తమ కెమెరాలతో చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేశారు.