![Rajasthan High Court quashes cow smuggling case against Pehlu Khan - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/30/pehlu-khan.jpg.webp?itok=rE5FjqJX)
జైపూర్: గోరక్షకుల కిరాకత మూకదాడిలో మృతి చెందిన పెహ్లూ ఖాన్, అతని ఇద్దరు కుమారులపై నమోదైన ఆవుల స్మగ్లింగ్ కేసును రాజస్థాన్ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. మూకదాడిలో చనిపోయిన పెహ్లూ ఖాన్, అతని కొడుకులపై గత మే నెలలో రాజస్థాన్ పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జంతువధ, జంతు తరలింపు నిషేధ చట్టంలోని సెక్షన్ 5,8, 9ల కింద ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నారంటూ అభియోగాలు మోపారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన పెహ్లూ ఖాన్ కొడుకులకు తాజాగా ఊరట లభించింది.
2017 ఏప్రిల్ 1వ తేదీన అల్వార్‌లో పెహ్లూ ఖాన్, అతని కొడుకులు ఓ వాహనంలో ఆవులను తరలిస్తుండగా.. అతను ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడనే అనుమానంతో గోరక్షకులు కిరాతక చర్యకు దిగారు. వారి వాహనాన్ని అడ్డుకొని.. వారిపై దాడి చేశారు. వృద్ధుడు అన్న కనికరం చూపకుండా గోరక్షకులు అతన్ని చితకబాదడంతో.. రెండురోజుల తర్వాత పెహ్లూ ఖాన్ ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలో బాధితుడు, మృతుడైన పెహ్లూ ఖాన్‌కు వ్యతిరేకంగానే చార్జిషీట్ పోలీసులు దాఖలు చేయడంతో అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, గత బీజేపీ ప్రభుత్వం హయాంలో ఈ కేసు విచారణ జరిగిందని, ఆ విచారణ అనుగుణంగానే ఇప్పుడు చార్జిషీట్ వేశారని, . కేసు విచారణలో ఏమైనా వివక్షలు, అవకతవకలు ఉంటే.. కేసును మళ్లీ పునర్విచారణ జరిపిస్తామని అప్పట్లో సీఎం అశోక్ గెహ్లాట్ హామీ ఇచ్చారు. మూకదాడిలో తండ్రిని కోల్పోయానని, అయినా తమపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారని అప్పట్లో పెహ్లూ ఖాన్ కొడుకు ఇర్షాద్ (25) ఆవేదన వ్యక్తంచేశాడు.
Comments
Please login to add a commentAdd a comment