‘రజనీ అంటే ఏమిటో నేను స్వయంగా చూశాను’
న్యూఢిల్లీ: తాను రాజకీయాలకు తగినవాడిని కాదని ప్రముఖ దక్షిణాది నటుడు రజనీకాంత్ తనతోఅన్నారని కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్‌గడ్కరీ అన్నారు. తాను ఎప్పుడు వెళ్లినా చెన్నైలో రజినీని కలుస్తానని, ఆ సమయంలో తామిద్దరం రాజకీయాలు మాట్లాడుకుంటామని, ఆయనతో తనకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఒక వేళ రజనీ రాజకీయాల్లోకి వస్తే అది జరగాలనే కోరుకుంటానని చెప్పిన ఆయన రజినీ బీజేపీలో చేరిత తప్పకుండా సముచిత స్థానం ఉంటుందని చెప్పారు.
అయితే, రజనీ బీజేపీలో చేరితే ఏ స్థానం ఇస్తారని ప్రశ్నించగా తనకు అలా చెప్పే అధికారం ఉన్నా, నిర్ణయం తీసుకునేవాడినే అయినప్పటికీ పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటరీ బోర్డు మాత్రమే ఈ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. జయలలిత స్థానాన్ని భర్తీ చేయగల స్థాయి తమిళనాడులో ఒక్క రజనీకాంత్‌కే ఎందుకుందని అనుకుంటున్నారని ప్రశ్నించగా.. రజినీకి గొప్ప సపోర్ట్ ఉందన్నారు. చెన్నైలో తాను ఒకసారి రజనీని కలిసేటప్పుడు ఒక ఇంజినీర్‌ను తనతో తీసుకెళ్లి ఆయనను కలిపించానని, ఆ సమయంలో రజనీ అతడితో కరచాలనం చేశారని, అప్పటి నుంచి కూడా మూడు రోజులపాటు ఆ ఇంజినీర్ తన చేతులను మడిచే ఉంచారని చెప్పారు.
ఇది రజనీ అంటే అక్కడి ప్రజలకు ఉన్న ప్రేమ, ఆకర్షణకు ఉదాహరణ అని తెలిపారు. రజనీది మహారాష్ట్ర అని, కొల్లాపూర్ నుంచి తమిళనాడుకు వచ్చారని, ఆయన ఇంటి ముందు చత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద చిత్ర పటం కూడా ఉంటుందని గుర్తు చేశారు. తాను మాత్రం రజనీ రాజకీయాలకు వచ్చేందుకు కచ్చితమైన సమయం ఇదేనని సూచించాని తెలిపారు. బీజేపీలోనే రజనీ ఎందుకు చేరాలని కోరుకుంటున్నారని ప్రశ్నించగా..తాను రజనీ మంచి కోరుకునే వాళ్లలో ఒకడినని, ఇప్పటికీ ఆయనను ప్రత్యేకంగా వెళ్లి కలిసే ఉద్దేశం లేదని, తాను ఎప్పుడంటే అప్పుడు పార్టీలోకి రావొచ్చని గడ్కరీ స్పష్టం చేశారు.