కల్కాలో జరిగిన కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్
కల్కా/జమ్మూ: ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం మాని, వారిపై చర్యలు తీసుకుంటేనే పాకిస్తాన్‌తో చర్చలుంటాయని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆ చర్చలు కూడా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) అంశంపై మాత్రనేనన్నారు. అలాగే, పీవోకే కూడా భారత్‌లో అంతర్భాగం కావాలంటూ మరో మంత్రి జితేంద్ర సింగ్ ఆకాంక్షించారు. హరియాణాలోని కల్కాలో ఆదివారం రాజ్‌నాథ్ బీజేపీ జన్ ఆశీర్వాద్‌యాత్రను ప్రారంభించి, ప్రసంగించారు. ‘పాక్‌తో చర్చలంటూ జరిగితే అది పీవోకేనే తప్ప మరే అంశంపైనా కాదు. ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్తాన్ భయపడింది. ఆ దేశానికి అది చాలా త్రీవమైన అంశం. అందుకే ప్రతి దేశం గుమ్మం తడుతూ సాయం ఆర్థిస్తోంది.
మనల్ని భయ పెట్టాలని చూస్తోంది. అయితే, అగ్రరాజ్యం అమెరికా కూడా చర్చల ద్వారానే పరిష్కరించుకోండని సలహా ఇవ్వడంతో దిక్కులు చూస్తోంది’ అని అన్నారు. ‘ఏ అంశంపై అయినా మనం పాక్‌తో ఎందుకు మాట్లాడాలి? అసలు చర్చలు ఎందుకు జరపాలి? ఒకవేళ చర్చలు జరపాలంటే ముందుగా ఆ దేశం ఉగ్రవాదులకు మద్దతు, ఆశ్రయం ఇవ్వడం మానేయాలి’ అని పేర్కొన్నారు. ‘ఉగ్రవాదాన్ని ఎగదోయడం ద్వారా భారత్‌ను బలహీనపర్చాలని, ముక్కలు చేయాలని పాక్ కుట్ర పన్నుతోంది. పుల్వామా దాడికి ప్రతీకారంగా బాలాకోట్‌పై వైమానిక దాడి చేయించడం ద్వారా 56 అంగుళాల ఛాతీ ఉందని మన ప్రధాని మోదీ నిరూపించారు’ అని వ్యాఖ్యానించారు.
రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై కాంగ్రెస్ ఆరోపణలను ప్రస్తావిస్తూ ఆయన.. ‘రఫేల్ జెట్లు మన వద్ద ఉన్నట్లయితే బాలాకోట్ దాడులను కూడా మన భూభాగం నుంచే జరిపే వీలుండేది. అందుకే ఆ విమానాలను కొనుగోలు చేసి తీరుతాం’ అన్నారు. పీఎంఓలో రక్షణ శాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్ మాట్లాడుతూ.. మూడు తరాల వారి త్యాగాల ఫలితంగా ఆర్టికల్ 370 రద్దయింది. ఇలాగే, పీవోకే స్వాతంత్య్రం లభించాలని, అది కూడా భారత్‌లో అంతర్భాగం కావాలని, మనం స్వేచ్ఛగా ముజఫరాబాద్ ‘పీవోకే రాజధాని) వెళ్లి వచ్చే సమయం రావాలని ప్రార్థిద్దాం’ అని అన్నారు.
ఆర్టికల్ రద్దు సరైనదే
హరియాణ మాజీ సీఎం హూడా
రోహ్‌తక్: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని కాంగ్రెస్ సీనియర్ నేత, హరియాణ మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడా అన్నారు. ఆర్టికల్ 370 రద్దును కాంగ్రెస్ వ్యతిరేకిస్తోన్న సంగతి తెలిసిందే. దేశ భక్తి విషయంలో తగ్గే ప్రసక్తే లేదని భూపిందర్ అన్నారు. అందుకే బీజేపీ నిర్ణయానికి మద్దతిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌పై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు 25 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. అందులో 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ కమిటీ తెలిపే ఫలితాలను చండీగఢ్‌లో వెల్లడిస్తామన్నారు. పార్టీ అధిష్టానం ఆయనకు సరైన గుర్తింపును ఇవ్వక పోవడంతో పార్టీ వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment