'ఫ్రెండ్స్‌నయితే మార్చుకోగలం కానీ...'
న్యూఢిల్లీ: కుదిరితే స్నేహితులను మార్చుకోవచ్చేమోగానీ.. పొరుగువారిని మాత్రం మార్చలేమని కేంద్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. పాకిస్థాన్లో సార్క్ సమావేశానికి వెళ్లిన ఆయన ఈ సందర్భంగా తాను విన్న, చూసిన అనుభవాలను రాజ్యసభలో పంచుకున్నారు. పాక్ వ్యవహార శైలిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు పాక్కు మర్యాద తెలియదని పరోక్షంగా చెప్పారు. 'మనం స్నేహితులను మార్చుకోవచ్చు.. పొరుగువారిని కాదు. మన ప్రధాని (నరేంద్రమోదీ) చాలా కాలంగా పాక్ తో స్నేహపూర్వకంగా ఉంటున్నారు. వారితో ఎప్పుడూ మంచి ఒప్పందాలు చేసుకునేందుకు ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. పాక్ ప్రవర్తనకు నేను లంచ్ కూడా చేయకుండానే వచ్చాను.
అయితే, పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రతి ఒక్కరిని లంచ్కు పిలిచి ఆయన కారులో వెళ్లారు. నేను కూడా వెళ్లొచ్చాను. ఈ విషయంలో నాకు ఎలాంటి ఫిర్యాదు లేదు. అయితే, ఒక అతిథిని ఆహ్వానించినప్పుడు దానికి తగిన ఏర్పాట్ల విషయంలో కొన్ని అంశాలు పాటించాలి. అది మన బాధ్యత కూడా. కానీ, అదేది పాక్ వద్ద లేదు. ఉగ్రవాదంపై తన స్పీచ్ ను పాక్ బ్లాక్ చేసిందని మీడియా ద్వారా తెలుసుకున్నాను. ఒక్క విషయం మాత్రం చెప్పగలను.. ఇస్లామాబాద్ లోని లగ్జరీస్ సెరేనా హోటల్ లో జరిగిన కార్యక్రమానికి నాతోపాటు వచ్చిన ప్రతినిథులను, మీడియాను మాత్రం లోపలికి అనుమతించలేదు. ఇది చెప్పడానికే కాస్తంత ఇబ్బందిగా ఉంది' అంటూ రాజ్ నాథ్ తన విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మొత్తం రాజ్యసభ పాక్ తీరును ఖండించింది.