విద్యుత్ సంక్షోభంపై రాజ్యసభలో చర్చ
పరిష్కారానికి పలు సూచనలు చేసిన సభ్యులు
న్యూఢిల్లీ: దేశంలో నెలకొని ఉన్న విద్యుత్ సంక్షోభంపై మంగళవారం రాజ్యసభ స్పందించింది. విద్యుత్ కోతలను నివారించేందుకు సభలో జరిగిన చర్చ సందర్భంగా సభ్యులు పలు సూచనలు చేశారు. కోల్ ఇండియా లిమిటెడ్‌ను పునర్వ్యవస్థీకరించడం, రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు ఆర్థికసాయం చేసి వాటిని నష్టాల్లోంచి బయటకు తీసుకురావడం, కేంద్ర, రాష్ట్ర సంబంధాలను మరింత మెరుగుపర్చడం, విద్యుత్ చట్టాన్ని సమీక్షించడం.. మొదలైనవి అందులో ఉన్నాయి. అలాగే, విద్యుదుత్పత్తి చేసేలా గ్రామపంచాయితీలను ప్రోత్సహించాలని, అణు విద్యుత్ సహా సంప్రదాయేతర విద్యుదుత్పత్తిని పెంచాలని, సరఫరా వ్యవస్థను మెరుగుపర్చాలని సభ్యులు సూచించారు. కాంగ్రెస్‌కు చెందిన సభ్యుడు పీ భట్టాచార్య చర్చను ప్రారంభిస్తూ.. గ్రామీణ విద్యుదీకరణకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. సరఫరా నష్టాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని బీఎస్పీ సభ్యుడు అవతార్ సింగ్ కోరారు.
యంత్ర సామగ్రిని చైనా, కొరియాల్లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా దేశీయ బీహెచ్‌ఈఎల్‌కు ప్రాధాన్యతనిచ్చేలా ప్రభుత్వరంగ ఎన్టీపీసీని ఆదేశించాలని కాంగ్రెస్ సభ్యుడు నచియప్పన్ సూచించారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను మెరుగుపర్చడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చని ఎన్సీపీ సభ్యుడు ప్రఫుల్ పటేల్ పేర్కొన్నారు. విద్యుత్ అంశాన్ని కేంద్ర జాబితాలో చేర్చాలని ఎస్పీ సభ్యుడు నరేశ్ అగర్వాల్ కోరారు. ఉత్తరప్రదేశ్‌లో దారుణంగా ఉన్న విద్యుత్ సమస్యను పలువురు సభ్యులు ప్రస్తావిస్తూ.. ఆ రాష్ట్రం నుంచి గెలిచిన ప్రధాని, ఇతర మంత్రులు.. తక్షణమే స్పందించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పవర్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డీఎంకే సభ్యురాలు కళిమొణి డిమాండ్ చేశారు.