'షెల్జాకు కుల వివక్ష'పై రాజ్యసభలో రగడ
న్యూఢిల్లీ: గుజరాత్లోని ఓ ఆలయంలో తాను కులవివక్ష ఎదుర్కొన్నానని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు కుమారి షెల్జా .. రాజ్యసభలో వెల్లడించడం దుమారాన్ని రేపింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
రాజ్యసభ సమావేశాల తొలిరోజు బుధవారం రాజ్యాంగంపై జరిగిన చర్చలో షెల్జా మాట్లాడుతూ.. 'గుజరాత్లో ఓ ఆలయ దర్శనానికి వెళ్లినపుడు నా కులం గురించి అడిగారు' అని చెప్పారు. దీనిపై రాజ్యసభ నాయకుడు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ.. ప్రధాన ఆలయంలో ఆమె కులం గురించి అడగలేదని అన్నారు. దీనిపై షెల్జా జోక్యం చేసుకుంటూ.. ద్వారక ఆలయంలో తనను కులం గురించి అడగలేదన్ని విషయాన్నిస్పష్టంగా చెప్పానని, ఆలయ సందర్శనకు వెళ్లినపుడు తనకు ఎదురైన సంఘటనను మంత్రి పక్కనబెట్టి, తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. షెల్జాకు కాంగ్రెస్ సభ్యులు మద్దతుగా నిలిచారు. ఈ సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలియజేస్తూ రాజ్యసభ చైర్మన్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ సభను రెండుమార్లు వాయిదా వేశారు.