మంత్రి విచారం వ్యక్తం చేసినా....
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ కుమారి షెల్జాపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో గందరగోళం రేగింది. గోయల్ విచారం వ్యక్తం చేసినా సభా కార్యకలాపాలు సాగలేదు. సభను దారిలోకి తెచ్చేందుకు చైర్మన్ హమీద్ అన్సారీ, డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
తన కులం కారణంగా కొన్నేళ్ల కిందట గుజరాత్ లోని ద్వారక ఆలయంలో వివక్షకు గురయ్యానని కుమారి షెల్జా వెల్లడించడంతో వివాదం మొదలైంది. ఇదంతా ఆమె కల్పించి చెప్పారని గోయల్ వ్యాఖ్యానించారు. దీంతో గోయల్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. వెల్ లోకి దూసుకొచ్చి ఆందోళన తెలిపారు. దీంతో సభను 30 నిమిషాల పాటు వాయిదా వేశారు. తర్వాత గోయల్ క్షమాపణ చెప్పినా పరిస్థితి సద్దుమణగకపోవడంతో సభా కార్యక్రమాలు సజావుగా సాగలేదు.