న్యూఢిల్లీ : కరోనాపై పోరుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన వంతు సాయం అందించిన సంగతి తెలిసిందే. మరోవైపు కరోనా సంక్షోభం వేళ రాష్ట్రపతి భవన్ ఖర్చులను కూడా ఆదా చేసే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి వినియోగం కోసం రూ. 10 కోట్లు విలువచేసే విలాసవంతమైన సరికొత్త లిమోసిన్ కారు కొనుగోలు చేయాలని రాష్ట్రపతి భవన్ భావించింది. అయితే ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. అలాగే విందులకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయకూడదని రాష్ట్రపతి భవన్ వర్గాలు నిర్ణయించాయి. భవిష్యత్తులో జరిగే విందుల్లో పరిమిత సంఖ్యలో ఆహార పదార్థాలను ఉంచడంతో పాటు.. అతిథుల జాబితాను కొంతమేర తగ్గించాలని చూస్తోంది. (చదవండి : రాష్ట్రపతి వేతనంలో 30 శాతం స్వచ్ఛందంగా)
అలాగే రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో పెద్ద ఎత్తున జరిగే పూల అలంకరణలు కూడా పరిమితం చేయాలని భావిస్తోంది. వచ్చే ఏడాది వరకు రాష్ట్రపతి భవన్‌కు సంబంధించి ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని నిర్ణయం తీసకుంది. లక్షలాది మంది వలస కార్మికులు, పేద ప్రజలు కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. కాగా, రామ్‌నాథ్ కోవింద్ ప్రస్తుతం.. మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ (ఎస్ 600) వినియోగిస్తున్నారు.
కరోనాపై పోరుకు తనవంతు సాయంగా పీఎంకేర్స్ ప్రత్యేక నిధికి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఇప్పటికే ఒక నెల జీతాన్ని విరాళంగా అందజేయగా.. తాజాగా ఆయన తన వేతనంలో 30 శాతాన్ని ఏడాది పాటు పీఎం కేర్స్ నిధికి విరాళంగా ఇస్తున్నట్లు గురువారం రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన చేసింది.
Comments
Please login to add a commentAdd a comment