సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రపతి సతీమణి సవితా కోవింద్, కుమార్తె స్వాతి విజయవాడలోని భవానీ ద్వీపంలో బుధవారం పర్యటించారు. పున్నమిఘాట్ వద్ద పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక పడవలో వారు కృష్ణానదిలో విహరించారు. దాదాపు మూడు గంటల పాటు వారు విజయవాడలోని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను సందర్శించారు.
ముందుగా స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన 36వ జాతీయ గులాబీల ప్రదర్శనను వారు తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గంగిరెద్దుల విన్యాసాలను తిలకించారు. 600 రకాల గులాబీలను ఒకేచోట ప్రదర్శించిన మహిళలను అభినందించారు. పూల సోయగాలు, వాటి అలంకరణ బాగుందని ప్రశంసించారు. అనంతరం వారు ఇంద్రకీలాద్రిపై వెలసిన కనదుర్గమ్మను దర్శించుకుని అక్కడి నుంచి పున్నమి ఘాట్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోటులో భవానీ ద్వీపం చేరుకున్నారు. అక్కడ వారికి రాష్ట్ర పర్యాటక శాఖ డైరెక్టర్ హేమాన్షు శుక్లా ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అతిథులను ఆహ్లాదపరిచే విధంగా ఏర్పాటు చేసిన కోలాటం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన గిరిజన ధింసా నృత్యాన్ని తిలకించారు.
భవానీ ద్వీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంగళగిరి పట్టు చీరల స్టాల్‌ను సందర్శించి వాటి నాణ్యత ప్రమాణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. లేపాక్షి స్టాల్‌ను సందర్శించి కొండపల్లి బొమ్మలను కొనుగోలు చేసి వాటి విశేషాలను తెలుసుకున్నారు. బందరు మిఠాయి స్టాల్ వద్ద బందరు లడ్డూ రుచులను ఆస్వాదించారు. ప్లోటింగ్ పౌంటేయిన్, మ్యూజికల్ లేజర్ షోను తిలకించారు. అక్కడి నుంచి పర్యాటక శాఖకు చెందిన బోధసిరి ప్రత్యేక పడవలో పున్నమి ఘాట్ చేరుకున్నారు.
జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, డీసీపీ క్రాంతి రాణా టాటా నేతృత్వంలో ప్రత్యేక అధికారులు రాష్ట్రపతి కుటుంబసభ్యులు సందర్శించే ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటనలో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సుజాతశర్మ, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment