దేశానికి నువ్వేమిచ్చావు: రవీనా టాండన్
ఢిల్లీ: మత అసహనంపై ఆందోళన వ్యక్తం చేసిన బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్‌పై నటి రవీనా టాండన్, బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ మండిపడ్డారు. నరేంద్ర మోదీని ప్రధానిగా చూడలేని వ్యక్తులు, ఇప్పుడు ప్రభుత్వాన్ని దించేయాలనుకుంటున్నారని నటి రవీనాటాండన్ పేర్కొన్నారు. రవీనా టాండన్ ట్వీట్ల సారాంశం ఇలా ఉంది.. ''మోదీని ప్రధానిగా చూడకూడదని అనుకునేవాళ్లంతా ప్రభుత్వాన్ని కూల్చేయాలనుకుంటున్నారు. వాళ్లు దేశానికి సిగ్గుచేటు. అసహనాన్ని ఖండించాలని, దానిపై చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ చెప్పొచ్చు. కానీ, ఇలా విషం చిమ్మడం సరికాదు. దేశానికి గుండెకాయ లాంటి ముంబై మహానగరం మీద బాంబుల వర్షం కురిసినప్పుడు వాళ్లకు ఎందుకు భయం వేయలేదో అని ఆశ్చర్యం వేస్తోంది. మోదీ ప్రధాని అయిన రోజు నుంచి తాము సంతోషంగా లేమని వీళ్లు బహిరంగంగా చెబితే బాగుండేది. అంతేతప్ప మొత్తం దేశం సిగ్గుపడేలా వ్యాఖ్యానించడం సరికాదు. వాళ్లకు నిజంగా దమ్ముంటే ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పాలి. అంతేతప్ప దేశ పరువు ప్రతిష్ఠలను దిగజార్చకూడదు. ఏ రకమైన నిరసనతోనూ నాకు ఎలాంటి సమస్యా లేదు. కానీ మన దేశాన్ని గౌరవించే విషయానికొద్దాం.. దేశం నీకు ఏమిచ్చిందో, నువ్వు దేశానికి ఏమిచ్చావో ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో.''
ఇక ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కుందని షానవాజ్ హుస్సేన్ చెబుతూనే, ఈ దేశం అమీర్ ఖాన్కు చాలా ఇచ్చిందన్నారు. భారత్ కన్నా మరో మెరుగైన దేశాన్ని అమీర్ ఖాన్ చూడలేరని, దేశ ప్రతిష్ఠను మంటగలపడానికి అమీర్ ఖాన్ ప్రయత్నిస్తున్నారని షానవాజ్ ధ్వజమెత్తారు.
మరోవైపు అమీర్ ఖాన్ పై ఢిల్లీలోని అశోక్ నగర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. అమీర్ ఖాన్ ఇంటి ఎదుట భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అమీర్‌ఖాన్‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు ప్రారంభించడంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు సంఘటనలు తనకు ఆందోళన కలిగించాయని.. తన భార్య కిరణ్‌రావ్ ఈ దేశం వదిలి వెళ్దామని కూడా ప్రతిపాదించారని సోమవారం ఢిల్లీలోని రామ్‌నాథ్ గోయంకా అవార్డుల కార్యక్రమంలో అమీర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.