సాక్షి,న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు పాల్పడే ప్రొఫెసర్లు, అథ్యాపకుల జాబితా వెల్లడించి విద్యావ్యవస్థలో కలకలం రేపిన లా స్టూడెంట్ రయా సర్కార్‌కు వేధింపుల పర్వం మొదలైంది. రయా సర్కార్ సాహసాన్ని అందరూ కొనియాడుతున్నా తనను రేప్ చేస్తామంటూ సోషల్ మీడియా ఖాతాల్లో హెచ్చరికలు వస్తున్నాయని బాధితురాలు పేర్కొన్నారు. ‘నాపై విషం చిమ్ముతున్నారు..చంపేస్తామనడం నుంచీ రేప్ చేస్తామనే వరకూ బెదిరింపులు వస్తున్నాయ’ని చెప్పారు.యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో లా చదువుతున్న 24 ఏళ్ల రయా సర్కార్ భారత అత్యున్నత విద్యా సంస్థల్లో సాగుతున్న అరాచకాలను బయటపెట్టారు. అథ్యాపకుల వేధింపలకు తానూ బాధితురాలినేనని చెప్పుకొచ్చారు.
ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన జేఎన్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీ, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, మణిపాల్ యూనివర్సిటీ, ఆసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం వంటి ప్రైవేట్ విద్యా సంస్థల్లో లైంగిక వేధింపులకు పాల్పడే అథ్యాపకుల జాబితాను రయా సర్కార్ వెల్లడించారు. ప్రఖ్యాత నిర్మాత హార్వీ వెన్‌స్టీన్ లైంగిక వేధింపుల బారిన పడ్డ పలువురు హాలీవుడ్ నటీమణులు హార్వీ దురాగతాలపై పెదవివిప్పడం, వేధింపులపై మహిళలు బహిరంగంగా మాట్లాడుతున్న గ్లోబల్ మిటూ క్యాంపెయిన్‌ల నేపథ్యంలో రయా సర్కార్ భారత అత్యున్నత విద్యా సంస్థల్లో జరుగుతున్ననిర్వాకాన్ని బయటపెట్టడం పెను దుమారం రేపింది. రయా జాబితాలో 69 మంది ప్రొఫెసర్లను పేర్కొంటూ ఈ జాబితా మరింత పెరుగుతుందని చెప్పడం విద్యా వ్యవస్థ దిగజారుడుతనాన్ని ఆవిష్కరిస్తోంది.
ఫెమినిస్టుల ఫిర్యాదు
మరోవైపు విద్యావ్యవస్థలో లైంగిక వేధింపులపై ఏళ్ల తరబడి సాగుతున్న పోరాటం రయా సర్కార్ జాబితా వెలువరించడంతో పక్కదారి పట్టిందని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.ఆమె తన జాబితాను ఉపసంహరించాలని మరికొందరు ఫెమినిస్టులు డిమాండ్ చేస్తున్నారు. మహిళా సమస్యలపై నిత్యం పోరాడే ఫెమినిస్టులు 24 ఏళ్ల రయా సర్కార్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఆమె మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. ఇక యూజీసీ డేటా ప్రకారం ఏప్రిల్ 1, 2016 నుంచి మార్చి 31, 2017 వరకూ 103 మంది విద్యార్థినులు తమపై లైంగిక వేధింపులు జరిగాయని ఫిర్యాదు చేశారు.
ఈ ఏడాది జూన్‌లో ఐఐటీ భువనేశ్వర్‌లో తన ప్రొఫెసర్ తనను లైంగికంగా వేధించారని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. 2012 నుంచి ఈ దారుణం జరుగుతున్నదని తనకు సాయం చేయాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాసి సంచలనం సృష్టించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఐఐటీ భువనేశ్వర్ ఆరోపణలు ఎదుర్కొన్న ప్రొఫెసర్‌ను వెనకేసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment