గాంధీనగర్: పొడవు జడ కోసం తహతహలాడే యువతులు చాలామందే ఉంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో ఉన్న జుట్టు కాపాడుకోవడమే కష్టంగా మారింది. అలాంటిది ఇక వాలుజడకు చోటెక్కడిది. కానీ ఓ భారతీయ యువతి తన జుట్టుతో రికార్డు సృష్టించి అందరి దృష్టినీ ఆకర్షించింది. గుజరాత్‌కు చెందిన నీలాన్షి పటేల్ 190 సెం.మీ(6.2 అడుగులు) జుట్టుతో ప్రపంచంలోనే పొడవాటి జుట్టు కలిగిన యువతిగా గిన్నిస్ రికార్డుకెక్కింది. 2018లో 170.5 సెం.మీ(5.59 అడుగులు) పొడవు జుట్టుతో గిన్నిస్‌లో చోటు దక్కించుకున్న నీలాన్షి తాను నెలకొల్పిన రికార్డును తనే తిరగరాసింది. దీనిపై నీలాన్షి మాట్లాడుతూ.. ‘చిన్నతనంలో హెయిర్ డ్రెస్సర్ సరిగ్గా జుట్టు కత్తిరించలేదు. ఆ కోపంతో మరెప్పుడూ జుట్టు కత్తిరించుకోవద్దని శపథం పూనుకున్నాను. నా నిర్ణయాన్ని మా తల్లిదండ్రులు కూడా స్వాగతించారు. అలా 11 సంవత్సరాలుగా నా జుట్టుకు కత్తెర అవసరం రాలేదు. అతని పొరపాటే నా పాలిట వరంగా మారింది’ అని ఆమె చెప్పుకొచ్చింది.
అయితే గతంలో జరిగిన తప్పిదం వల్లే నీలాన్షికి ఇంత అదృష్టం దక్కిందని ఆమె సంతోషం వ్యక్తం చేశాడు. నీలాన్షిని ఆమె స్నేహితులు, బంధువులు ముద్దుగా రపుంజెల్(పొడవాటి జుట్టు ఉండే ఓ కార్టూన్ పేరు) అని పిలుస్తారట. తనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన కురుల కోసం నీలాన్షి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. జుట్టు నేలపై ఆనకుండా పొడవాటి హీల్స్ ధరిస్తుంది. తలస్నానం చేసిన ప్రతిసారి ఎండలో లేదా హెయిర్‌డ్రయర్ ద్వారా కానీ జుట్టును ఆరబెట్టుకుంటుంది. వారానికి ఒకటి, రెండు సార్లు తలకు నూనె రాసుకుంటుంది. కానీ స్విమ్మింగ్ చేసేటప్పుడు మాత్రం ఇబ్బంది తప్పట్లేదంటోంది. ఇక జుట్టును ఎప్పుడూ అల్లుకోవడమే ఇష్టమని, కానీ కొన్ని ప్రత్యేక సమయాల్లో మాత్రం కొప్పు కడుతానని చెప్పుకొచ్చింది. కొప్పున్న అమ్మ ఎన్ని కొప్పులేసినా అందమే అని ఊరికే అనలేదు మరి.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment