కాంగ్రెస్, బీజేపీలపై చర్యలు | Receipt of foreign funds, the Delhi High Court judgment | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, బీజేపీలపై చర్యలు

Published Sat, Mar 29 2014 3:33 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM

కాంగ్రెస్, బీజేపీలపై చర్యలు - Sakshi

కాంగ్రెస్, బీజేపీలపై చర్యలు

 విదేశీ నిధుల స్వీకరణపై ఢిల్లీ హైకోర్టు తీర్పు
 న్యూఢిల్లీ: ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు బ్రిటన్‌కు చెందిన వేదాంత రిసోర్సెస్ అనుబంధ సంస్థల నుంచి విరాళాలు స్వీకరించటం.. చట్టాలను ఉల్లంఘించటమేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టంచేసింది. ఆ రెండు పార్టీలపై ఆరు నెలల్లోగా తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నిర్దేశించింది. అలాగే రాజకీయ పార్టీలకు అందుతున్న విరాళాల వివరాలను పునఃపరిశీలించాలని, వాటిలో విదేశాల నుంచి అందిన రుణాలను గుర్తించి, వాటిపై చట్టంలో నిర్దేశించిన ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి, ఈసీకి హైకోర్టు శుక్రవారం ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యంపై  ఇచ్చిన తీర్పులో నిర్దేశించింది.
 
 ‘వేదాంత’ రాజకీయ విరాళం రూ. 140 కోట్లు...
 రాజకీయ పార్టీలు ప్రభుత్వ సంస్థలు, విదేశీ సంస్థల నుంచి విరాళాలు స్వీకరించటాన్ని ప్రజా ప్రాతినిధ్యం చట్టం, విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టాలు నిషేధిస్తున్నాయని.. అయితే ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఆ చట్టాలను ఉల్లంఘించి ప్రభుత్వ, విదేశీ సంస్థల నుంచి విరాళాలు స్వీకరించాయని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం అనే స్వచ్ఛంద సంస్థ ఇటీవల ఒక పిల్‌ను దాఖలు చేసింది. వేదాంత సంస్థ 2012 వార్షిక నివేదిక ప్రకారం.. ఆ సంస్థ తన ట్రస్టు ద్వారా కానీ, నేరుగా కానీ భారతదేశ సాధారణ ఎన్నికలకు సంబంధించి 20.1 లక్షల డాలర్లు (సుమారు 14 కోట్ల రూపాయలు) రాజకీయ విరాళాలుగా ఇచ్చిందని ఎన్‌జీవో తన పిల్‌లో ఆరోపించింది.
 
 ఈ పిల్‌కు సంబంధించి కేంద్ర హోంశాఖ ఇచ్చిన సమాధానంలో.. ఈ రెండు పార్టీలకు వేదాంత సంస్థ నుంచి విరాళాలు వచ్చాయని అంగీకరించారని పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంపై కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక విచారణ బందం (సిట్) ద్వారా కానీ, సీబీఐ ద్వారా కానీ దర్యాప్తు జరిపించాలని.. ఎన్‌జీవో భాగస్వామి అయిన మాజీ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ఇ.ఎ.ఎస్.శర్మ హైకోర్టును కోరారు.
 
 విదేశీ సంస్థలు కాదంటూ సమర్థించుకున్న
 కాంగ్రెస్, బీజేపీ
 కాంగ్రెస్, బీజేపీలు తమ వాదనల్లో.. వేదాంత సంస్థ యజమాని భారతపౌరుడైన అనిల్‌అగర్వాల్ అని, ఆ సంస్థ అనుబంధ సంస్థలు భారత్‌లోనే ఏర్పాటయ్యాయని, కాబట్టి అవి విదేశీ వర్గాలు కావని సమర్థించుకున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలైన స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్, మెటల్స్ అండ్ మినరల్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాల నుంచి రూ. లక్ష విరాళం పొరపాటున తమ పార్టీ ఖజానాకు వచ్చాయని, వాస్తవానికి ఆ విరాళం తమ విద్యార్థి విభాగమైన ఎన్‌ఎస్‌యూఐకి ఉద్దేశించినవని కూడా కాంగ్రెస్ నివేదించింది. పిల్‌ను విచారించిన జస్టిస్ ప్రదీప్ నందరాజోగ్, జస్టిస్ జయంత్‌నాథ్‌లతో కూడిన ధర్మాసనం.. ఎన్‌జీవోతో పాటు కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్, బీజేపీల వాదనలను విని ఫిబ్రవరి 28వ తేదీన విచారణ పూర్తి చేసి తీర్పును వాయిదా వేసింది.
 
 అవి నిస్సందేహంగా విదేశీ విరాళాలే: హైకోర్టు
 ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరిస్తూ.. ‘‘ఈ పార్టీలు (బీజేపీ, కాంగ్రెస్) స్టెరిలైట్, సెసా అనే కంపెనీల నుంచి విరాళాలను స్వీకరించటం.. చట్టం నిర్వచనలో విదేశీ వర్గాల నుంచి విరాళాలు స్వీకరించటమే. ఈ పార్టీలు ప్రాధమికంగా చట్టాలను ఉల్లంఘించాయనటంలో మాకు ఎలాంటి సందేహం లేదు’’ అని ఢిల్లీ హైకోర్టు స్పష్టంచేసింది.
 
 
 కంపెనీల చట్టం ప్రకారం వేదాంత రిసోర్సెస్ సంస్థ విదేశీ కంపెనీయేనని.. కాబట్టి అనిల్‌అగర్వాల్‌కు చెందిన ఆ సంస్థతో పాటు, దాని అనుబంధ సంస్థలైన స్టెరిలైట్, సెసాలు కూడా విదేశీ సంస్థలేనని తేల్చిచెప్పింది. కాంగ్రెస్, బీజేపీలపై తగిన చర్యలు తీసుకోవాలని, పార్టీల విదేశీ నిధులను గుర్తించి చట్టప్రకారం చర్యలు చేపట్టాలని ఈసీ, కేంద్ర ప్రభుత్వాలకు నిర్దేశించింది. అలాగే.. ఎన్‌ఎస్‌యూఐకి వెళ్లాల్సిన విరాళం పొరపాటుగా కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చిందనటం నిజమో కాదో దర్యాప్తు చేసి నిర్ధారించి, చర్యలు చేపట్టాలని కూడా ధర్మాసనం స్పష్టంచేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement